Kolkata : 'అపరాజిత బిల్లు' ఆమోదం పొందిన‌ రోజే రెండు లైంగిక వేధింపుల‌ ఘటనలు..!

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అన్ని వైపుల నుండి చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే

By Medi Samrat  Published on  4 Sep 2024 2:20 PM GMT
Kolkata : అపరాజిత బిల్లు ఆమోదం పొందిన‌ రోజే రెండు లైంగిక వేధింపుల‌ ఘటనలు..!

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అన్ని వైపుల నుండి చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. తీవ్ర నిరసనల మధ్య మంగళవారం బెంగాల్ అసెంబ్లీ అత్యాచార నిరోధక అపరాజిత బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అపరాజిత బిల్లు ఆమోదం పొందిన రోజు కూడా కోల్‌కతాలో మహిళలపై లైంగిక వేధింపుల‌ ఘటనలు వెలుగు చూశాయి.

కోల్‌కతాలో గత 24 గంటల్లో రెండు వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. EM బైపాస్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఓ ఘటన వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో ఘ‌ట‌న‌లో.. రాజర్‌హట్‌లో నివసిస్తున్న 38 ఏళ్ల మహిళ ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత రాత్రి 12 గంటల సమయంలో హోటల్‌లో పార్టీ సందర్భంగా మహిళను, ఆమె సోదరిని అనుచితంగా తాకినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరసన తెలిపితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు బెదిరించారని వెల్ల‌డించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఒక నిందితుడిని ఢిల్లీలోని పితాంపుర నివాసి అరుణ్ కుమార్ (60), మరో నిందితుడిని కోల్‌కతాకు చెందిన రింకు గుప్తా (43)గా గుర్తించారు. అరుణ్‌ హోటల్‌లో ఉంటున్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తనను కలవాలని తనకు తెలిసిన రింకూని పిలిచాడు. ఇద్దరూ ఒక హోటల్ పార్టీకి హాజరయ్యారు, అక్కడ వేధింపుల సంఘటన జరిగింది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రెండో ఘటన కోల్‌కతాలో విద్యార్థినిపై వేదింపుల‌కు పాల్ప‌డ్డ‌ మోడలింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని అరెస్టయ్యాడు. మోడల్ కావాలనుకున్న ఆ విద్యార్థి ఇటీవలే అక్కడ అడ్మిషన్ తీసుకుంద‌ని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లగా.. నిందితుడు తనను వేధించారని విద్యార్థిని ఆరోపించింది. విద్యార్థిని హరిదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌గా.. మంగళవారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేశారు.

Next Story