'నేను డిప్రెషన్‌లో ఉన్నాను'.. సుప్రీంలో మహిళా న్యాయవాది వీరంగం

బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కోర్టులో ఓ మహిళా న్యాయవాది వీరంగం సృష్టించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

By -  Medi Samrat
Published on : 3 Dec 2025 7:22 PM IST

నేను డిప్రెషన్‌లో ఉన్నాను.. సుప్రీంలో మహిళా న్యాయవాది వీరంగం

బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కోర్టులో ఓ మహిళా న్యాయవాది వీరంగం సృష్టించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పదే పదే అడ్డంకులు క‌లిగించ‌డంతో కోర్టు సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌కే సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఓ కేసును విచారిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

లేడీ లాయర్ ఈ రోజు జాబితాలో లేని విషయాన్ని పెద్దగా లేవనెత్తడం ప్రారంభించింది. తన సన్నిహితుల్లో ఒకరిని ఢిల్లీలోని గెస్ట్ హౌస్‌లో హత్య చేశారని, గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన అదే పోలీసు అధికారిని ఇప్పుడు విచారణ అధికారిగా నియమించారని న్యాయవాది ఆరోపించారు. కోర్టుకు నిబంధనలు ఉన్నాయని, సరైన పద్ధతిలో పిటిషన్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఆమెకు వివరించారు. దీనిపై న్యాయవాది 'నేను డిప్రెషన్‌లో ఉన్నాను, నేను పిటిషన్ వేస్తాను' అని చెప్పింది. అయితే ఆమె ఆ త‌ర్వాత కూడా కోర్టును విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు. ప‌లు మార్లు వివ‌రించి చెప్పినా విన‌లేదు. మహిళా న్యాయవాది మాట్లాడుతూనే ఉంది. దీంతో తదుపరి కేసు విచారణ కూడా అంతరాయం కలిగింది. ఆ సమయంలో మహిళా భద్రతా సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి విషమించింది. లాయర్ గట్టిగా మాట్లాడుతూ.. నన్ను తాకవద్దు, తప్పుగా ప్రవర్తించవద్దు అని ఆమె బిగ్గరగా అర‌డం కొనసాగించడంతో ప్రత్యక్ష ప్రసారాన్ని కొంత సేపు మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు సెక్యూరిటీ బృందం ఆమెని కోర్టు గది నుంచి బయటకు తీసుకొచ్చింది.

Next Story