జార్ఖండ్‌లో ముగిసిన‌ రాజకీయ సంక్షోభం

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముగిసింది. బలపరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీఎం చంపాయ్ సోరెన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు.

By Medi Samrat  Published on  5 Feb 2024 4:02 PM IST
జార్ఖండ్‌లో ముగిసిన‌ రాజకీయ సంక్షోభం

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముగిసింది. బలపరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీఎం చంపాయ్ సోరెన్ తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో చంపాయ్ ప్రభుత్వం విజయం సాధించింది. ఓటింగ్ సమయంలో ఆయనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించగా, 29 మంది ఎమ్మెల్యేలు విపక్షంగా ఓటు వేశారు.

జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో చంపాయ్ ప్రభుత్వం మెజారిటీని పరీక్షించింది. అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలో బలపరీక్ష ప్రక్రియ పూర్తయింది. చంపాయ్ సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా, ప్రతిపక్షంలో 29 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీలో తన మెజారిటీని సులువుగా నిరూపించుకున్నారు చంపాయ్. చంపాయ్ సోరెన్ మెజారిటీకి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే అవసరం కాగా 47 ఓట్లు వ‌చ్చాయి.

దీంతో జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ పార్ట్-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంపాయ్ సోరెన్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన హేమంత్ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ మన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రతి వ్యక్తి హేమంత్ సోరెన్ ప్రభుత్వ పథకాలతో అనుసంధానించబడ్డారని కూడా ఆయన అన్నారు.

జార్ఖండ్ మాజీ డిప్యూటీ సీఎం, ఏజేఎస్‌యూ పార్టీ అధ్యక్షుడు సుదేశ్ మహతో మాట్లాడుతూ.. విశ్వాస ఓటింగ్ ప్రశ్నల ప్రాతిపదికన జరగలేదని, సభ్యుల ప్రాతిపదికన జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వారి దగ్గర సమాధానం లేదు. అవినీతిపై లేవనెత్తిన ప్రశ్నలపై మౌనం వహించారని అన్నారు.

ఇటీవల ఈడీ హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. దీని తర్వాత హేమంత్ సోరెన్ అధికారాన్ని చంపై సోరెన్‌కు అప్పగించారు. గవర్నర్ ఆయనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలో జేఎంఎం-కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్ నుంచి రాంచీకి తిరిగి వచ్చారు. చంపై సోరెన్‌కు మద్దతుగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా అసెంబ్లీకి చేరుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Next Story