దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆవుల స్మగ్లింగ్ గురించి వార్తలు వింటున్నాం. స్థానిక యంత్రాంగాలు కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ స్మగ్లర్లు ఎటువంటి భయం లేకుండా స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక మంత్రి ఆవుల అక్రమ రవాణా చేసే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కన్నడ జిల్లాలో ఆవుల దొంగతనం ఘటనల నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మంకాల్ ఎస్ వైద్య మాట్లాడుతూ.. అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను బహిరంగంగా కాల్చివేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగనివ్వబోమని మంత్రి అన్నారు. గోవుల రక్షణకు, వాటిని పెంచే వారి ప్రయోజనాలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల హొన్నావర్ సమీపంలో గర్భిణీ ఆవును చంపిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.
ఎన్నో ఏళ్లుగా ఆవుల దొంగతనం జరుగుతోంది. ఇది ఆపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగకూడదని ఎస్పీకి చెప్పాను. గోవులను పూజిస్తాం. మేము ఈ జంతువును ప్రేమతో ఉంచుతాము. దాని పాలు తాగి పెరిగాం. దీని వెనుక ఎవరున్నారంటే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం.. ఇలాంటివి కొనసాగితే నిందితులను నడిరోడ్డుపై కాల్చిచంపేలా చూస్తానని చెప్పారు.