భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలను దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు ఖండించాయి.
తమ ఏటీఎంలతో పాటు అన్ని డిజిటల్ సేవలు పూర్తిస్థాయిలో, సజావుగా పనిచేస్తున్నాయని తెలిపాయి. ఎస్‌బీఐ తమ అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా వివరణ కూడా ఇచ్చింది. "మా అన్ని ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు మరియు డిజిటల్ సేవలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ప్రజల వినియోగానికి అందుబాటులో ఉన్నాయని" తెలిపింది.. ధృవీకరించని సమాచారంపై ఆధారపడవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. పలు బ్యాంకులు కూడా తమ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, డిజిటల్ సేవలు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సైబర్ భద్రత సన్నద్ధతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు.