అజిత్, శరద్ పవార్ మళ్లీ ఒక్కటవుతారా.? కుటుంబం నుంచే సంకేతాలు..!
మహారాష్ట్ర రాజకీయాల్లో 'పవార్ ఫ్యామిలీ' ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 9:46 AM ISTమహారాష్ట్ర రాజకీయాల్లో 'పవార్ ఫ్యామిలీ' ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. రెండు వర్గాలుగా విడిపోయిన ఈ కుటుంబం ఐక్యతపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి, శరద్ పవార్ పుట్టినరోజు సందర్భంగా అజిత్ పవార్ ఆయనను కలవడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అదే సమయంలో కుటుంబ సభ్యుల ప్రకటన కూడా చాలా చర్చనీయాంశమైంది, దీని కారణంగా రూమర్ల మార్కెట్ వేడిగా ఉంది.
శరద్ పవార్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తల్లి సునంద పవార్ మాటలను బట్టి ఈ ఊహాగానాలు వస్తున్నాయి. అజిత్, శరద్ పవార్ వర్గాల ఐక్యతను ఆమె నొక్కి చెప్పారు. ఇవి నాకే కాదు రెండు పార్టీల కార్యకర్తల మనోభావాలు అని సునంద అన్నారు. కుటుంబం ఐక్యంగా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది. పవార్ కుటుంబం మంచి, చెడు సమయాల్లో ఐక్యంగా ఉంది.. ఇప్పుడు కూడా అలా చేయాలన్నారు. కార్యకర్తల్లాగే నేను కూడా ఐక్యంగా ఉంటేనే పార్టీ మరింత బలపడుతుందని.. రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదగగలదనే నమ్మకం ఉందన్నారు. పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తానని ఆమె అన్నారు.
ఇద్దరు నేతలు ఒక్కటవ్వడాన్ని పరిగణిస్తారా అని సునంద పవార్‌ను ప్రశ్నించగా.. నేను కేవలం ప్రచారంతో మాత్రమే ముడిపడి ఉన్నానని.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పింది. ఇప్పుడు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందో లేదో అజిత్, శరద్ పవార్ నిర్ణయించుకుంటారని ఆమె అన్నారు.
ఇటీవల అజిత్ పవార్ ఢిల్లీలో శరద్ పవార్‌ను కలిశారు. శరద్ పవార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శరద్ పవార్ గురువారం 84వ ఏట అడుగుపెట్టారు. సమావేశం అనంతరం అజిత్ పవార్ మాట్లాడుతూ.. నేను కేవలం మామయ్యను అభినందించేందుకు, ఆశీస్సులు పొందేందుకు వచ్చానని చెప్పారు.
గతేడాది జులైలో అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత ఎన్సీపీలో చీలిక రావడం గమనార్హం. అప్పుడే ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది.