జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను ఆయన కార్యాలయంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపారు. బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ కశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలోని తహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భట్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతి చెందారు.
ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతున్నాయి. ఈ దారుణ ఘటనపై ఆయన భార్య స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను చంపేందుకు ఆయన కార్యాలయంలోని తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. తాను పని చేస్తున్న కార్యాలయంలో తనకు భద్రత లేదని, జిల్లాలోని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని తన భర్త పలుమార్లు విజ్ఞప్తి చేసినా... అధికారులు స్పందించలేదని ఆమె ఆరోపించారు.