కేజ్రీవాల్‌కు కారు లేదు.. ఆయన ప్రత్యర్థి ఆస్తులు మాత్రం..
ఢిల్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో బుధవారం వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కనిపించాయి.
By Medi Samrat Published on 16 Jan 2025 10:02 AM ISTఢిల్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో బుధవారం వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కనిపించాయి. పాదయాత్ర, రోడ్‌షో ద్వారా అభ్యర్థులు తమ సత్తాను చాటుకున్నారు. ఆప్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, బీజేపీ మాజీ ఎంపీలు ప్రవేశ్ వర్మ, సతీశ్ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్ భాటియా, విజేంద్ర గుప్తా, రాజ్‌కుమార్ ఆనంద్, కైలాష్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్‌తో పాటు ఇతర నేతలు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు మొత్తం 235 మంది అభ్యర్థులు 341 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం అభ్యర్థి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు కారు లేదు. సొంత ఇల్లు ఉంది. అదే సమయంలో ఆదాయం దాదాపు ఐదు రెట్లు పెరిగింది. 2022-23 సంవత్సరంలో ఆయన ఆదాయం రూ. 1.67 లక్షలు కాగా, 2023-24లో రూ.7.21 లక్షలకు పెరిగింది. ఆయన వద్ద రూ.50,000 నగదు ఉంది. అలాగే రూ.1.73 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. ఆయనపై ఐదు కేసులు కూడా నమోదయ్యాయి.
ఇక కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఆస్తుల విలువ రూ.91.62 కోట్లు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. రూ.2.20 లక్షల నగదు, రూ.8.25 లక్షల నగలు, భార్య పేరిట రూ.45.75 లక్షల విలువైన ఆభరణాలు, రూ.77.89 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అతనికి మూడు ఇళ్లు, మూడు కార్లు కూడా ఉన్నాయి.
ఆప్‌కు చెందిన కీలక నేత, మాజీ మంత్రి షకూర్ బస్తీ అసెంబ్లీ అభ్యర్థి సత్యేందర్ జైన్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు కూడా కారు లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సత్యేంద్ర ఆదాయం రూ.1,73,450 కాగా, 2023-24లో రూ.3,11,410కి పెరిగింది. ఇది కాకుండా రూ.30,67,195 విలువైన చరాస్తులను అఫిడవిట్‌లో చూపించారు. ఇందులో 100 గ్రాముల బంగారం ఉంది. స్థిర ఆస్తుల విలువ రూ.4,12,00000. ఇందులో పల్లా గ్రామంలో వ్యవసాయ భూమి, పితంపురాలో ఇల్లు, మీరట్‌లోని ఒక ప్లాట్ ఉన్నాయి.