కిరీటం 'షిండే' తలపైనే ఉంటుందా.? పగ్గాలు 'ఫడ్నవీస్'కు అప్పగిస్తారా.?
మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాకూటమి బంపర్ విజయాన్ని అందుకుంటోంది.
By Medi Samrat Published on 23 Nov 2024 12:11 PM ISTమహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాకూటమి బంపర్ విజయాన్ని అందుకుంటోంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాల్లో మహాయుతి 223 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో MVA భారీ ఓటమిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర అధికారాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఏక్‌నాథ్ షిండే సీఎం అవుతారా లేక దేవేంద్ర ఫడ్నవీస్ తలపై ఈ కిరీటం పెడతారా అనేది తీవ్ర చర్చనీయాంశం.
సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌దే పైచేయి అని తెలుస్తోంది. నిజానికి మహారాష్ట్రలో బీజేపీ 145 స్థానాల్లో పోటీ చేయగా.. 127 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ అత్యధిక స్ట్రైక్‌రేట్ సాధించింది. అదే సమయంలో.. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో పోటీ చేసి 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గెలుపు మార్జిన్‌ను పరిశీలిస్తే.. ఫడ్నవిస్ బీజేపీకి మహారాష్ట్రలో ముఖ్యమైన నాయకుడు కాబట్టి ఆయనదే పైచేయి అని తెలుస్తోంది.
చివరిసారి ఫడ్నవీస్‌ను డిప్యూటీ సీఎం చేయడం ద్వారా బీజేపీ ఆశ్చర్యపరిచింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్వయంగా ప్రభుత్వంలో చేరడానికి ఇష్టపడలేదు.. కానీ హైకమాండ్ ఒత్తిడితో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఇక ఏక్‌నాథ్ షిండే కూడా సీఎం రేసులో వెనుకబడి ఉన్నారని భావించలేము. నిజానికి.. షిండే బీజేపీకి అత్యంత అవసరమైన సమయంలో మద్దతు ఇచ్చారు. శివసేనను బద్దలు కొట్టడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రేను షిండే అతిపెద్ద దెబ్బ తీశారు. ఈ కారణంగా బీజేపీ అతనికి ప్రాథాన్యత ఇవ్వవచ్చు. అదే సమయంలో మహాకూటమి ఐక్యతను కాపాడేందుకు బీజేపీ షిండేను మళ్లీ సీఎం చేసే అవకాశం కూడా ఉంది. దీంతో తిరుగుబాటుకు కూడా అవకాశం ఉండదు.
మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం దిశగా పయనించడంపై ఫడ్నవీస్ మాట్లాడారు. ఇది ఊహించిన దానికంటే పెద్ద విజయమని అన్నారు. ఇప్పుడు అందరం కలిసి తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తాం అన్నారు. అదే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌కు అత్యంత సన్నిహితుడైన నాయకుడు ప్రవీణ్ దారేకర్ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే తదుపరి ముఖ్యమంత్రి కాగలరని అన్నారు.