ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. 26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట అమెరికా నిలబెట్టుకుంది. అతడిని భారత్ కు తీసుకుని వచ్చారు.
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్న రాణా లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవించాడు. ముంబయి దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. భారత్ కు రాకుండా తప్పించుకోడానికి తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి.
తహవూర్ రాణా 1961లో పాకిస్థాన్‌లోని చిచావత్నీలో జన్మించాడు. బిజినెస్ మేన్‌గా చికాగోలో సెటిల్ అయిన అతడు అంతకుముందు పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో కెప్టెన్‌గా పని చేశాడు. ఆ తర్వాత 1997లో కెనడాకు వలస వెళ్లాడు. అనంతరం అమెరికాకు వెళ్లి ట్రావెల్ సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్‌లోని ఆ సంస్థ కార్యాలయంలోనే ముంబై పేలుళ్లకు లష్కరే తోయిబా ఉగ్రవాది, 26/11 కుట్రకు మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీకి ఆశ్రయం కల్పించినట్లు ఎన్ఐఏ గుర్తించింది.