121 మంది మృతికి కారణమైన.. భోలే బాబా గురించిన సంచలన విషయాలు
ఉత్తరప్రదేశ్‌లోని భోలేబాబా నిర్వహించిన సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 July 2024 5:53 AM GMT121 మంది మృతికి కారణమైన.. భోలే బాబా గురించిన సంచలన విషయాలు
ఉత్తరప్రదేశ్‌లోని భోలేబాబా నిర్వహించిన సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. దీంతో అసలు ఎవరీ భోలేబాబా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. భోలేబాబా అసలు పేరు నారాయణ్ సాకార్ హరి. తనను తాను దేవుడి శిష్యుడిగా ప్రకటించుకుని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తుంటాడు. షూ, టై ధరించి ప్రవచనాలు ఇచ్చే ఈ బాబా.. 26 ఏళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేసి ఆధ్యాత్మికత బాట పట్టినట్టు చెబుతుంటాడు. భోలే బాబా ఎటా జిల్లాలోని పాటియాలీ తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందినవాడు.
అతను ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఉద్యోగి అని చెప్పుకున్నాడు. మతపరమైన ప్రసంగాలు చేయడం కోసం 26 ఏళ్ల క్రితం తన ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అతనికి పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో సహా భారతదేశం అంతటా అతనికి మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ముఖ్యంగా, అనేక ఆధునిక మతపరమైన వ్యక్తుల మాదిరిగా కాకుండా, భోలే బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ అధికారిక ఖాతాలను కలిగి లేరు. అట్టడుగు స్థాయిలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ప్రతి మంగళవారం భోలే బాబా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేలాది మంది హాజరవుతారు. ఈ సమావేశాల సమయంలో వాలంటీర్లు భక్తులకు ఆహారం, పానీయాలతో సహా అవసరమైన ఏర్పాట్లను చేస్తారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించడం కొనసాగించినందుకు భోలే బాబా దృష్టిని ఆకర్షించారు.
తొక్కిసలాట ఘటన తర్వాత ఆచూకీ లభించని భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తొక్కిసలాటకు కారణమైన భోలే బాబా ప్రస్తుతం ఎక్కడున్నాడో పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. భోలే బాబా ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఆయన ప్రధాన సేవాదార్ దేవ్ ప్రకాశ్ మధుకర్, ఇతర ఆర్గనైజర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. హాథ్రాస్ తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. తొక్కిసలాటకు కారణమైన వారిని శిక్షించినట్టు ఆయన చెప్పారు. అయితే ఇవాళ దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు.