‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి విద్వేషాలు, హింసాత్మక సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దీనిపై వివాదాలు చెలరేగుతున్నాయి. దీన్ని చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యతిరేకించారు.
సినిమా నిషేదంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రకటించారు. రాష్ట్రంలో రన్నింగ్ స్క్రీన్‌ల నుండి సినిమాను తొలగించేలా చూడాలని బెంగాల్ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ- 'ఇంతకు ముందు కశ్మీర్ ఫైల్స్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు కేరళ కథతో ముందుకు వచ్చి.. బెంగాల్ ఫైల్స్ ను సిద్ధం చేయడానికి ప్లాన్ చేస్తోంది. వక్రీకరించిన వాస్తవాలతో కేరళను కించపరిచే కుట్ర ఈ చిత్రం అని దీదీ అన్నారు. బెంగాల్‌లో శాంతిని కొనసాగించడానికి, విద్వేషపూరిత నేరాలు, హింసను నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.