పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్..10 వేలకు పైగా భారతీయ విమానాలు రద్దు: DGCA

పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు భారీ షాక్ తగిలింది.

By -  Knakam Karthik
Published on : 7 April 2026 7:20 PM IST

National News, Delhi, WestAsiaCrisis, AviationNews, FlightCancellations, DGCA, AirspaceClosure

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్..10 వేలకు పైగా భారతీయ విమానాలు రద్దు: DGCA

పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు భారీ షాక్ తగిలింది. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన సుమారు 10,000కు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. సాధారణంగా ఈ ప్రాంతానికి రోజుకు సగటున 300 నుండి 350 విమానాలు నడిచేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 80-90కి పడిపోయిందని జాయింట్ సెక్రటరీ అసంగ్బా చుబా ఆవో తెలిపారు.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జోర్డాన్, లెబనాన్, కువైట్, ఖతార్, యూఏఈ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం లేదా ఆంక్షలు విధించడం వల్ల అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికాకు వెళ్లే విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం మరియు ఇంధన ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పైలట్ల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఏప్రిల్ 30 వరకు పైలట్ల విధి నిర్వహణ సమయం (FDTL) నిబంధనలను డీజీసీఏ (DGCA) తాత్కాలికంగా సడలించింది. పరిస్థితిని బట్టి ఈ గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

తాజా సడలింపుల ప్రకారం, ఇద్దరు పైలట్లు నడిపే సుదూర విమానాల్లో 'ఫ్లైట్ టైమ్' (FT)ను 1.30 గంటలు అదనంగా పెంచి, మొత్తం 11.30 గంటలకు పొడిగించారు. అదేవిధంగా 'ఫ్లైట్ డ్యూటీ పీరియడ్' (FDP)ను 1.45 గంటలు పెంచి 11.45 గంటలుగా నిర్ధారించారు. విమానం టేకాఫ్ కోసం కదలడం ప్రారంభించినప్పటి నుంచి, గమ్యస్థానం చేరాక పూర్తిగా ఆగిపోయే వరకు పట్టే సమయాన్ని 'ఫ్లయింగ్ టైమ్'గా పరిగణిస్తారు.

పైలట్ల అలసటను తగ్గించి, విమాన భద్రతను పెంచేందుకు డీజీసీఏ గతేడాది కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పైలట్లకు ఇచ్చే వరుస విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఈ సడలింపులు తాత్కాలికమే అయినప్పటికీ, సిబ్బంది లభ్యత, నిబంధనల పాటింపు వంటి అంశాలపై విమానయాన సంస్థలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని డీజీసీఏ అధికారులు తెలిపారు.

Next Story