ముంబైలో వీకెండ్ లాక్‌డౌన్ షురూ
Weekend Lockdown in Mumbai. మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు
By Medi Samrat Published on 10 April 2021 8:59 AM ISTమహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మహా ప్రభుత్వం వారాంతంలో కఠినమైన లాక్ డౌన్ విధించింది. వీకెండ్ లాక్ డౌన్ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. అలాగే ప్రతిరోజు రాత్రివేళల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. 144 సెక్షన్ విధించగా.. ఐదుగురు లేదా ఎక్కువ మంది కనిపించరాదు. ఈ కొత్త ఆంక్షలు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయి.
ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ప్రభుత్వంలోని మంత్రుల నుంచే పూర్తి స్థాయి లాక్‌డౌన్ పెట్టాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని తాను ప్రతిపాదించినట్టు మహారాష్ట్ర మంత్రి విజయ్ వడెట్టివార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్‌డౌన్ పెట్టే అంశంపై అతి త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్ ను విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వాణిజ్య సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఓ ప్రకటన చేస్తూ, సోమవారం నుంచి తాము దుకాణాలన్నీ తెరుస్తామని హెచ్చరించింది. పండగ సీజన్ లో షాపుల మూసివేత కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని, ఇప్పటికే గత సంవత్సరం నెలకొన్న పరిస్థితులతో భారీ నష్టాల్లో ఉన్న తాము, మరోసారి కష్టాల్లోకి జారాలని భావించడం లేదని, అన్ని రకాల వాణిజ్య కేంద్రాలను మూసివేయడం సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి తాము ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని, ముఖ్యమంత్రిపై తమకు గౌరవం ఉందని, తాము చట్టాన్ని అతిక్రమించాలని భావించడం లేదని వ్యాపార సంఘాలు చెబుతున్నాయి.