మాకు ఈవీఎంలు వద్దు.. మళ్లీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించకుంటే..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 26 Nov 2024 5:31 PM ISTకాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుల గణనకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని.. కుల గణన జరిగితే అందరూ తమ వాటాను డిమాండ్ చేయడం ప్రారంభిస్తారేమోనని ఆయన భయపడుతున్నారని అన్నారు. మల్లికార్జున్ ఖర్గే.. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. మీకు నిజంగా దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని అన్నారు. తాల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా, అక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై ఖర్గే ప్రశ్నలు సంధించారు. గతంలో ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్ విధానాన్ని వెనక్కి తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని రద్దు చేయాలి. మాకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్ కావాలన్నారు. దేశంలో మళ్లీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించకుంటే కాంగ్రెస్ పెద్దఎత్తున ప్రచారం చేస్తుందని అన్నారు. బ్యాలెట్ పేపర్ల వాపసు కోసం కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేస్తుందని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. మీరు అధికారంలోకి వచ్చి దోచుకుని అదానీ, అంబానీ తదితరులకు ఇస్తున్నారని మండిపడ్డారు. మీరు దేశం గురించి ఆలోచించచరు. మోదీ, వారు.. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అదానీ కీలక పాత్ర పోషించినందున నేను ఈ మాట చెబుతున్నాను. ప్రధాని మోదీ వారికి చాలా ఆస్తులు ఇచ్చారని.. దాన్ని ఆపలేకపోతున్నారన్నారు. ఎన్నికల్లో బీజేపీ తరపున పంచుతున్నారు. వారికి సంస్థాగత సమగ్రత లేదు.. వారికి సమాఖ్య స్వభావం లేదన్నారు.