భారత దేశం మన కళ్ల ముందే ధ్వంసమైపోతోంది: రాహుల్ గాంధీ
We are witnessing the death of democracy alleged Rahul Gandhi.
By అంజి Published on 5 Aug 2022 5:34 AM GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజస్వామ్యం చనిపోతోందని అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రజాస్వామ్య ఖూనీని తిలకిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. శతాబ్ద కాలం పాటు ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన భారత్‌ను మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని అన్నారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాళ్లపై దారుణంగా దాడి చేస్తున్నారని, జైలులో వేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.
తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, నిరుద్యోగం పెరిగిందని, దేశంలో హింస కూడా అధికమైందని పేర్కొన్నారు. వీటి గురించి మాట్లాడితే ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందన్నారు. కేవలం నలుగురు లేదా ఐదుగురి స్వప్రయోజనాల కోసం ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఇద్దరు ముగ్గురు చేసిన వ్యాపారానికి ప్రభుత్వం అండగా ఉంటోందని రాహుల్ ఆరోపించారు.
సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు ఇవాళ ప్రధాని ఇంటిని చుట్టుముట్టనున్నారు. ఇక లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయ్ చౌక్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. జంతర్ మంతర్ మినహా న్యూఢిల్లీలోని ఇతర అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.