ఇదో చరిత్రాత్మక మలుపు..వక్ఫ్‌కు ఆమోదంపై.. ప్రధాని మోడీ ట్వీట్

వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడంపై ప్రధాని మోడీ స్పందించారు.

By Knakam Karthik
Published on : 4 April 2025 9:21 AM IST

National News, Parliament, Waqf Amendment Bill, PM Modi,

ఇదో చరిత్రాత్మక మలుపు..వక్ఫ్‌కు ఆమోదంపై.. ప్రధాని మోడీ ట్వీట్

వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో ప్రభుత్వానికి అధికారం కల్పించే వక్ఫ్ బిల్లును రెండు రోజులుగా అర్ధరాత్రి దాటాక కూడా సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఉభయ సభలు ఆమోదించాయి. గురువారం అర్థరాత్రి ఎగువ సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. సభలో ఓటింగ్ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేయగా, 95 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే, బిల్లుపై రాజ్యసభ దాదాపు 12 గంటల పాటు సుధీర్ఘగా చర్చ కొనసాగింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ‌క్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను కొట్టిపడేశారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటార‌ని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం ఉండదన్నారు. ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తుల నిర్వహణకు సంబంధించినదని, అవినీతిని నిర్మూలించడమే బిల్లును తీసుకొచ్చామని అన్నారు.

కాగా, వక్ఫ్ సవరణ బిల్లు-2025 లోక్‌సభలోనూ ఆమోదం పొందింది. సభలో ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా.. 232 మంది వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 12 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం అర్ధరాత్రి లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు రాష్ట్రపతికి వద్దకు వెళ్లి చ‌ట్టంగా మారనుంది.

వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తంచేశారు. కొన్ని దశాబ్దాలుగా వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన.. తాజా బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. వారి గళం వినిపించేందుకు అవకాశం దక్కుతుందని..ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story