కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న తన ప్రేమకథను గుర్తు చేసుకుంటూ పలు రహస్యాలను బయటపెట్టి పలువురిని షాక్‌కు గురిచేశారు. సమాజంలో కులవివక్ష కారణంగా విఫలమైన తన ప్రేమకథను గుర్తు చేసుకుంటూ ఓ కార్యక్రమంలో బహిరంగంగా ప్రజల ముందు మాట్లాడారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలో కులాంతర వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కాలేజీ రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తన ప్రేమకథను వివరించారు.
కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నాను.. కానీ అది జరగలేదు. ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. నేను చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాను, కాని ఆమె కుటుంబం, అమ్మాయి కూడా అంగీకరించలేదు. అందుకే పెళ్లి జరగలేదు. ఆ తర్వాత నా కులం అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి నా ముందుకు వచ్చిందన్నారు. దీని తర్వాత నా సొంత సంఘంలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు.
సీఎం చెప్పిన మాటలు విన్న ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. కులాంతర వివాహాలకు తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ.. కులాంతర వివాహాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు.
12వ శతాబ్దంలో కర్ణాటక సంఘ సంస్కర్త గౌతమబుద్ధుడు, బసవేశ్వర భగవానుల కాలం నుంచి కులవివక్షను తొలగించి సమాజంలో సమానత్వం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. సమానత్వంతో కూడిన సమాజాన్ని రూపొందించేందుకు ఎందరో సంఘ సంస్కర్తలు చేస్తున్న కృషికి ఇంతవరకూ ఫలితం దక్కకపోవడం శోచనీయమన్నారు.