మెగా రోడ్ షో నిర్వహించిన శశికళ
VK Sasikala holds mega roadshow amid power tussle in AIADMK. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి కె.పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంలు
By Medi Samrat Published on 27 Jun 2022 10:38 AM ISTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి కె.పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంలు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)లో పార్టీ నాయకత్వం గురించి గొడవ పడుతున్న తరుణంలో పార్టీ బహిష్కరణకు గురైన పార్టీ ప్రధాన కార్యదర్శి వికె శశికళ ఆదివారం మెగా రోడ్ షోను నిర్వహించారు. ప్రజల మద్దతు కూడగట్టేందుకు చెన్నై, తిరువళ్లూరు, తిరుత్తణిలలో రోడ్‌షో నిర్వహించారు. తమిళ నేల హక్కులను, మహిళల గౌరవాన్ని కాపాడడానికే శశికళ రోడ్‌షో చేపట్టారని ఆమె అనుచరులు చెప్పుకొచ్చారు.
శశికళ టి నగర్‌లోని తన నివాసం నుండి ప్రచార వాహనంలో బయలుదేరి ఆమె పలు ప్రాంతాల్లో ప్రజలను, కార్యకర్తలను కలిశారు. తిరుత్తణిలో ఆమె మాట్లాడుతూ.. 'ఎంజీ రామచంద్రన్ పార్టీని ప్రారంభించినప్పుడు పేదలు, సామాన్యుల కోసం ఈ పార్టీని పెడుతున్నానని, కులం- మతం వంటి బేధాలు లేని పార్టీ అని, సంక్షేమం కోసం ఈ పార్టీ పనిచేశానని' చెప్పారు. జయలలిత కూడా అదే స్థాయిలో ప్రజలకు మంచి చేశారని వివరించారు శశికళ.
పార్టీలో అంతర్గత పోరు గురించి ఆమె మాట్లాడుతూ.. 'నాకు సంబంధించినంత వరకు పార్టీ కార్యకర్తలు, ప్రజానీకం నా వెంటే ఉన్నారని, అందుకే పేదలు, సామాన్యులకు అండగా ఉండే అన్నాడీఎంకే పాలనను త్వరలోనే తీసుకొస్తానని' అన్నారు. అంతర్గత కుమ్ములాటలు, పార్టీ భవిష్యత్తుపై శశికళ మాట్లాడుతూ.. 'పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవల వల్ల పార్టీ మొత్తం కష్టాల్లో కూరుకుపోయిందని అనుకోలేం' అని వ్యాఖ్యానించారు.