ఎలాంటి నేరం చేయకపోయినా 20 ఏళ్లుగా జైలు శిక్ష.. ఇన్నేళ్లకు నిర్ధోషిగా తేల్చిన న్యాయస్థానం
Vishnu Tiwari who spent 20years in jail in false rape case. చేయని నేరానికి న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చినందుకు.. 20 ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు.
By Medi Samrat Published on 16 March 2021 10:04 AM ISTఎలాంటి నేరం చేయలేదు.. కానీ ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవించాడు. ఏ పాపం ఎరుగని ఓ వ్యక్తి జీవితం జైలులో మగ్గిపోయింది. చేయని తప్పుకు నేరస్తుడిగా ముద్రపడి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. చేయని నేరానికి న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చినందుకు.. 20 ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు. ఇరవై ఏళ్ల తర్వాత అసలు నిజం తెలిసి న్యాయస్థానం అతన్ని నిర్ధోషిగా ప్రకటించడంతో ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈనెల 3న విడుదల కాగా, తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యుక్త వయసులోనే జైలుకెళ్లిన ఆ వ్యక్తి 43 ఏళ్ల వయసులో జైలు నుంచి తిరిగి వచ్చాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌ఫూర్‌కు చెందిన విష్ణు తివారిపై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు నమోదయ్యాయి. కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ కేసు పెట్టింది. దీంతో 2000 సంవత్సరం సెప్టెంబర్ 1న ఈ కేసులో విష్ణు తివారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సమయంలో విష్ణు వయసు 23 ఏళ్లు. తాను ఏ తప్పు చేయలేదని, తనకేం తెలియదని అతడు పోలీసుల ముందు మొరపెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. కేసు విచారణ సమయంలో మూడేళ్ల పాటు అతడు జైల్లోనే ఉన్నాడు. ఇక ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు చివరకు అతడని దోషిగా తేల్చింది. విష్ణుపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద అతడికి జీవిత ఖైదును విధించింది న్యాయస్థానం.
ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు..
కాగా, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ విష్ణు హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తుది తీర్పు వెలువరించే వరకు అప్పటికే ఏడేళ్లు గడిచిపోయాయి. ఏకంగా 20 ఏళ్ల కాలం పట్టింది. చివరకు ఈ ఏడాది జనవరి నెలాఖరులో హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పును వెల్లడిస్తూ తివారీని నిర్దోషిగా తేల్చింది. ఈనెల మూడో తేదీన జైలు అధికారులు విడుదల చేశారు.
అధికారులను తప్పుబట్టిన ధర్మాసనం
అయితే ఈ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు.. అధికారుల తీరుపై తప్పుబట్టింది. అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా సంబంధిత శాఖ అతని గురించి పట్టించుకోలేదని పేర్కొంది. ఈ కేసులో వాస్తవానికి తగిన ఆధారాలు కూడా లేవు. ఆమె వద్ద నిందితుడి వీర్యం రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు దాఖలాలు లేవు. ఆమె గొంతు నొక్కి, కింద పడేస్తే గాయాలైన కావాలి.. అలాంటి దాఖలాలు కూడా లేవు. పైగా వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఏమి లేదు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని భావిస్తున్నాం. అతడు ఏ నేరం చేయకపోయినా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం బాధాకరం అంటూ అలహాబాద్ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఇక హైకోర్టు తీర్పు అనంతరం అతడు విడుదలయ్యేందుకు పూర్తి ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల రోజుల సమయం పట్టింది. మొత్తానికి మార్చి 3న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
ఇదిలా ఉండగా, అతడికి జరిగిన అన్యాయం గురించి తెలిసిన పలు స్వచ్చంద సంస్థలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దుస్తులతో పాటు ఆర్థిక సాయం కూడా చేశారు. ప్రస్తుతం ఆ డబ్బులతో అతడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.