7500 మందిని కాపాడిన భారత ఆర్మీ
మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపునిచ్చిన "గిరిజన సంఘీభావ యాత్ర"
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 May 2023 4:15 PM IST7500 మందిని కాపాడిన భారత ఆర్మీ
మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపునిచ్చిన "గిరిజన సంఘీభావ యాత్ర" సందర్భంగా హింస చెలరేగడంతో మణిపూర్‌లోని అనేక జిల్లాల్లో సైన్యం, అస్సాం రైఫిల్ సిబ్బందిని మోహరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ఆర్మీ బుధవారం రాత్రి ఏరియా డామినేషన్ కసరత్తులు నిర్వహించింది. గిరిజన గ్రూపులు చేస్తున్న ఆందోళన వల్ల 8 జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్టీ హోదా గురించి ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ గిరిజనలు నిరసనలు చేపట్టారు. ఇంపాల్, చురాచంద్‌పూర్, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో హింస చెలరేగడంతో మొత్తం 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ దళాలు హింసాత్మక ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నాయి. ఆర్మీ క్యాంపుల్లో దాదాపు 7500 మందికి ఆశ్రయం కల్పించారు. మైటిస్ వర్గానికి గిరిజన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని మణిపూర్ సీఎంను హోంమంత్రి కోరారు. మణిపూర్, కేంద్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ముగిసిన తర్వాత మణిపూర్‌లో అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఈ బలగాలను సమీప రాష్ట్రాల నుంచి మణిపూర్‌కు రప్పించనున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కేంద్రం, ఈశాన్య రాష్ట్రంలోని హింసాత్మక ప్రాంతాలలో మోహరింపు కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బృందాలను కూడా పంపింది.