వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా మహమ్మారిని జయించవచ్చని నిపుణులు చెబుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అయితే కొందరు మాత్రం వ్యాక్సిన్లు వేసుకోవడానికి జంకుతున్నారు. కొందరు గ్రామస్థులు వ్యాక్సిన్లను వేయించుకోవాలంటేనే భయపడుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరాబంకి గ్రామానికి చెందిన గ్రామస్థులు ఆరోగ్య అధికారులను చూసి నదిలోకి దూకేస్తూ ఉన్నారు. అధికారులు వ్యాక్సిన్లు వేయడానికి వస్తున్నారని తెలిసి సరయూ నదిలోకి దూకి పారిపోయారు కొందరు.
సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ శుక్లా మాట్లాడుతూ ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుందని తెలిపారు. వ్యాక్సిన్ల వలన ప్రయోజనాలు, ఏమీ అవ్వదు అంటూ హామీ ఇచ్చినా కూడా గ్రామస్థులు వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రాలేదు. కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వచ్చారు. చాలా వదంతులు గ్రామంలో ప్రచారంలో ఉండడంతో వారంతా భయపడ్డారని.. అందుకే వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు అధికారులు. దేశంలో ఓ వైపు వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూ ఉంటే.. మరికొందరేమో వ్యాక్సిన్లు వేయించుకోవాలంటేనే జంకుతూ ఉన్నారు.