'వందేమాతరం..' ఒక పాట నుండి 'జాతీయ గీతం'గా ఎలా మారిందో తెలుసా..?
'వందేమాతరం...' పాట స్వాతంత్య్ర ఉద్యమానికి గొంతుకగా నిలిచింది.
By - Medi Samrat |
'వందేమాతరం...' పాట స్వాతంత్య్ర ఉద్యమానికి గొంతుకగా నిలిచింది. బానిసత్వంలో నిద్రపోతున్న భారతీయులను ఎవరు మేల్కొలిపారు.? బంకించంద్ర ఛటోపాధ్యాయ కలం నుండి 'వందేమాతరం' ప్రతిధ్వనించినప్పుడు శ్రోతల గుండెల్లో విప్లవ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అది బ్రిటిష్ పాలన పునాదిని కదిలించింది. పొలాల నుంచి జైలు చీకటి గడియల వరకు ఈ పాట స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రతి నోట్లో మాతృభూమి పరిమళం, ప్రతి గీతలో స్వాతంత్య్ర స్ఫూర్తి కనిపించింది. తన నేల పట్ల అంకితభావానికి, త్యాగానికి, గర్వానికి ప్రతీకగా నిలిచిన జాతీయ గీతం 'వందేమాతరం' కేవలం రాసి పాడటమే కాదు జీవించింది కూడా.
జాతీయ గీతం 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 150 ఏళ్ల జాతీయ గీతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక తపాలా బిళ్లను, స్మారక నాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'వందేమాతరం' అనేది ఒక మంత్రం, ఒక కల, ఒక తీర్మానం, ఓ శక్తి అని అన్నారు. ఈ పాట భారతి మాత ఆరాధన. 'వందేమాతరం' భారతదేశ స్వాతంత్ర్య ప్రకటన. ఇది ప్రతి యుగానికి సంబంధించినదని పేర్కొన్నారు.
వందేమాతరం ఎప్పుడు రాశారు, ఎప్పుడు ముద్రించారు, జాతీయ గీతం ఎలా అయింది? వందేమాతరం కవిత్వం నుండి జాతీయ గీతం అయ్యే వరకు పూర్తి కథను తెలుసుకుందాం..
భారతదేశంలో బ్రిటిష్ పాలన ఉండేది. బంకించంద్ర చటోపాధ్యాయ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. ఆ రోజుల్లో, బ్రిటీష్ వారు ఒక ఉత్తర్వు ఇచ్చారు, అందులో ఇక నుండి భారతీయులందరూ 'గాడ్ సేవ్ ది క్వీన్' పాట పాడటం తప్పనిసరి అని చెప్పారు.
భారత గడ్డపై విదేశీ పాలకులను కీర్తిస్తూ పాటలు పాడాలనే ఈ శాసనం బంకిం చంద్ర చటోపాధ్యాయతో సహా లక్షలాది మంది భారతీయులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఈ క్రమంలో ఆయన గాయాలపై ఉప్పు చల్లినట్లు అనిపించింది. బ్రిటీష్ డిక్రీని వ్యతిరేకిస్తూ.. బలవంతంగా గాడ్ సేవ్ ది క్వీన్ పాట పాడాలనే నిబంధన విధించడం వల్ల బాధపడ్డ బంకించంద్ర చటోపాధ్యాయ 'వందేమాతరం' రాశారు.
బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం మొదటిసారిగా 1875 నవంబర్ 7న సాహిత్య పత్రిక బంగాదర్శన్‌లో ప్రచురించబడింది. ఏడేళ్ల తర్వాత బంకించంద్ర చటోపాధ్యాయ 1882లో ప్రచురించిన తన నవల 'ఆనందమత్'లో చేర్చారు. 1896లో కలకత్తాలో (ప్రస్తుతం కోల్‌కతా) జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వేదికపై నుంచి వందేమాతరం పాడారు. ఈ పాట జాతీయ స్థాయిలో బహిరంగంగా పాడటం ఇదే తొలిసారి. ఆ సమయంలో సభకు హాజరైన వేలాది మంది కళ్లలో నీళ్లు తిరిగాయి.
వందేమాతరం పాడినందుకు జరిమానా
19వ శతాబ్దం చివరి నాటికి, 20వ శతాబ్దం ప్రారంభం నాటికి 'వందేమాతరం' భారత జాతీయవాద నినాదంగా మారింది. 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సమయంలో వందేమాతరం ప్రజల గొంతుకగా మారింది. అదే సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ వారణాసి సెషన్‌లో అన్ని కార్యక్రమాలు, సమావేశాలలో 'వందేమాతరం' పాటను పాడింది.
20 మే 1906న, బరిసాల్‌లో (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) వందమాతరం ఊరేగింపు జరిగింది, దీనిలో 10 వేల మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇందులో హిందువులు, ముస్లింలు సహా అన్ని మతాలు, కులాల వారు వందేమాతరం జెండాలను చేతుల్లో పట్టుకుని వీధుల్లో ఊరేగించారు.
రంగ్‌పూర్‌లోని ఒక పాఠశాలలో పిల్లలు ఈ పాటను పాడగా.. బ్రిటిష్ ప్రభుత్వం 200 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 జరిమానా విధించింది. దీని తర్వాత బ్రిటిష్ పాలకులు అనేక పాఠశాలల్లో వందేమాతరం పాడడాన్ని నిషేధించారు. అంతే కాదు, విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించారు. ఆ సమయంలో విద్యార్థులు తరగతులు వదిలి, ఊరేగింపులు చేపట్టారు. ఈ పాట పాడటం ఆపలేదు.. చాలా చోట్ల పోలీసులు విద్యార్థులను కొట్టి జైల్లో పెట్టారు.
1905 ఆగస్టు 7న తొలిసారిగా వందేమాతరం రాజకీయ నినాదంగా ఉపయోగించబడింది.
1907లో మేడమ్ భికాజీ కామా బెర్లిన్‌లోని స్టట్‌గార్ట్‌లో భారతదేశం వెలుపల మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు.. ఆ జెండాపై వందేమాతరం కూడా వ్రాయబడింది.
1909 ఆగస్టు 17న ఇంగ్లండ్‌లో మదన్‌లాల్ ధింగ్రాను ఉరితీసినప్పుడు.. ఆయన పలికిన చివరి మాటలు 'వందేమాతరం'.
గోపాలకృష్ణ గోఖలే అక్టోబర్ 1912లో దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు, 'వందేమాతరం' నినాదాలతో ఆయనకు స్వాగతం పలికారు.
స్వాతంత్య్రానంతరం జన గణమన, వందేమాతరం రెండింటినీ జాతీయ చిహ్నాలుగా స్వీకరించడంపై రాజ్యాంగ సభలో పూర్తి ఏకాభిప్రాయం వచ్చింది, ఈ అంశంపై చర్చ జరగలేదు. జనవరి 24, 1950న, డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన పాత్ర పోషించినందున, 'వందేమాతరం'కి జాతీయ గీతం 'జన గణ మన'కి సమానమైన హోదా ఇవ్వాలని, సమాన గౌరవం ఇవ్వాలని అన్నారు.
డా.రాజేంద్రప్రసాద్ ప్రకటనను అంతా ఆమోదించారు. అదే రోజు నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జన-గణ-మన- బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన 'వందేమాతరం'ని జాతీయ గీతంగా ఆమోదించారు.