వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు చేస్తున్న రైల్వే.. ఇక‌పై 24 కోచ్‌లు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్‌లో పెద్ద మార్పు తీసుకురాబోతోంది

By Medi Samrat  Published on  21 Aug 2024 2:18 PM GMT
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు చేస్తున్న రైల్వే.. ఇక‌పై 24 కోచ్‌లు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్‌లో పెద్ద మార్పు తీసుకురాబోతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే ఇప్పుడు 24 కోచ్‌లతో వందేభారత్ రైలును తయారు చేయబోతోంది. రైలు త‌యారైతే ప్రీమియం రైళ్లలో వందే భారత్‌ అత్యంత పొడవైన రైలు అవుతుంది. ఇప్పటి వరకూ ఈ కేటగిరీలో రాజధాని ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. ఈ రైలుకు గరిష్టంగా 22 కోచ్‌లు ఉంటాయి.

వాస్తవానికి వందేభారత్ రైళ్ల కోచ్‌ల తయారీకి రూ.35 వేల కోట్ల విలువైన టెండర్లను ఇటీవల రద్దు చేశారు. టెండర్ పొందిన‌ కంపెనీ మరింత డబ్బు డిమాండ్ చేసింది. కానీ రైల్వే నిర్ణీత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. దీంతో టెండర్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైల్వేశాఖ మళ్లీ టెండర్‌ల‌ను పిల‌వ‌నుంది. ఈసారి రద్దు చేయనవసరం లేకుండా.. విస్తృతమైన మార్పులు చేశారు.

పాత రైల్వే టెండర్‌లో 200 స్లీపర్ వెర్షన్ వందేభారత్ రైళ్లను తయారు చేయాలని ఆర్డర్ ఉంది. ఇందులో ఒక్కో రైలులో 16 కోచ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాబోయే 35 సంవత్సరాల పాటు ఈ రైళ్ల నిర్వహణను కూడా కంపెనీ చూసుకోవాలి. ఈ ఒప్పందం యొక్క L-1 బిడ్డర్ లాతూర్‌లోని మరఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 120 రైలు సెట్‌లను ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. L-2 బిడ్డర్ చెన్నైలోని ICF వద్ద 80 రైలు సెట్‌లకు బాధ్యత వహించాడు. అయితే.. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల చేసిన మార్పు ప్రకారం.. 24 కోచ్‌లతో కూడిన 80 రైలు సెట్‌లను త‌యారు చేయాల్సిన అవసరం ఉంది.

కొత్త టెండర్ ప్రకారం.. ఒక్కో రైలు సెట్‌కు రూ.120 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. కొత్త సెట్‌కు సంబంధించి కేవలం 80 రైళ్లను మాత్రమే నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో రైలులో 24 కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది నవంబర్ నాటికి మహారాష్ట్రలోని లాతూర్‌లో నిర్మించిన ఫ్యాక్టరీకి ఈ టెండర్‌ను అప్పగించనున్నారు. ఈ ట్రెండ్‌ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మరియు రష్యా యొక్క కన్సార్టియం పూర్తి చేస్తుంది. ఈ ఆర్డర్ మొదటి నమూనా సెప్టెంబర్ 2025 నాటికి వెలువ‌డుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను 4 కంపెనీలు కైనెట్ రైల్వే సొల్యూషన్స్, జెవి-ఇండియా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రష్యన్ ఇంజనీరింగ్ కంపెనీ మెట్రోవాగన్‌మేష్, లోకోమోటివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ సంయుక్తంగా పూర్తి చేస్తాయి. మొదటి రెండు కంపెనీలు 25 శాతం, రెండోది 70 శాతం, మూడోది 5 శాతం రైళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి.

ఈ ఒప్పందం ప్రకారం.. మొదటి బ్యాచ్ ప్రోటోటైప్ 12 వందేభారత్ రైళ్లు ఒక సంవత్సరంలోపు వస్తాయి. అంటే మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 2026 నాటికి ట్రాక్‌ల మీద‌కు చేరుకుంటాయి. దీని తరువాత రెండవ సంవత్సరంలో 18 రైళ్లు తయారు చేస్తారు. ఆ త‌ర్వాత‌ ప్రతి సంవత్సరం 25 రైళ్లను ప్రారంభిస్తారు. జోధ్‌పూర్, ఢిల్లీ, బెంగళూరులలో ఈ రైళ్ల నిర్వహణ సౌకర్యాలు అభివృద్ధి చేయనున్నారు.

Next Story