వివాహంలో ఘర్షణకు దారితీసిన 'జూతా చుపాయి'..వరుడిని కొట్టిన వధువు బంధువులు
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik
వివాహంలో ఘర్షణకు దారితీసిన 'జూతా చుపాయి'..వరుడిని కొట్టిన వధువు బంధువులు
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వివాహం అనంతరం చెప్పులు దాచిపెట్టి వరుడిని వధువు తరపు బంధువులు ఆటపట్టించే సందర్భం ఘర్షణకు దారి తీసింది. ఉత్తరాఖండ్‌లోని చక్రతాకు చెందిన వరుడు ముహమ్మద్ షబీర్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. అనంతరం వివాహ ఆచారాల ప్రకారం నిర్వహించే 'జూతా చుపాయి' (చెప్పులు దాచడం)లో భాగంగా వధువు కుటుంబసభ్యులు వరుడి పాదరక్షలు దాచారు. వాటిని తిరిగి ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.50వేలకు బదులు వరుడు రూ.5 వేలు ఇచ్చారు. దీంతో వారు అతడిని బిచ్చగాడిలా ఇంత తక్కువ డబ్బు ఇచ్చావేంటంటూ తిట్టారు. దీంతో ఆగ్రహించిన వరుడి తరపు బంధువులు తమకు ఇచ్చిన బంగారం నాణ్యత గురించి ప్రశ్నించారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. వధువు బంధువులు వరుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టారు.
షబ్బీర్ కుటుంబం ప్రకారం, వధువు కుటుంబం వారిని ఒక గదిలో బంధించి కర్రలతో కొట్టింది. అయితే, బహుమతిగా పొందిన బంగారం నాణ్యత గురించి షబీర్ కుటుంబం ప్రశ్నించినప్పుడు వాదన గొడవగా మారిందని వధువు కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలను సముదాయించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు నజీబాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.