భారత్‌ తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా

Uttar Pradesh Sania Mirza to become India’s first Muslim woman fighter pilot. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా.. భారత వైమానిక

By అంజి  Published on  23 Dec 2022 10:21 AM IST
భారత్‌ తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా.. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా ఎంపికైంది. ఇలా ఎంపికైన వారిలో దేశంలోనే ఈమె మొదటి ముస్లిం బాలిక. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి మొదటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్ కూడా. సానియా మీర్జా మిర్జాపూర్ దేహత్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జసోవర్ గ్రామ నివాసి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె మీర్జాపూర్‌కే కాకుండా రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.

హిందీ మీడియం విద్యార్థులు కూడా దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారని హిందీ మీడియం స్కూల్‌లో చదివిన సానియా మీర్జా తెలిపింది. డిసెంబరు 27న ఆమె పూణెలోని ఎన్డీయే ఖడక్వాస్లాలో చేరనున్నారు. తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా ఆమెను చూసి గర్వపడుతున్నారు. సానియా తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ.. ''దేశం మొదటి ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేదిని సానియా మీర్జా తన రోల్ మోడల్‌గా భావిస్తుంది. మొదటి నుండి ఆమెలాగే ఉండాలని కోరుకుంది. దేశంలో ఫైటర్ పైలట్‌గా ఎంపికైన రెండో అమ్మాయి సానియా.'' అని చెప్పారు.

సానియా ప్రాథమిక చదువు నుండి 10వ తరగతి వరకు గ్రామంలోనే పండిట్ చింతామణి దూబే ఇంటర్ కళాశాలలో చదివింది. ఆ తర్వాత నగరంలోని గురునానక్ బాలికల ఇంటర్ కాలేజీకి వెళ్లింది. ఆమె 12వ యూపీ బోర్డులో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాత సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీలో తన పైలట్‌ లక్ష్యం కోసం సన్నాహాలను ప్రారంభించింది. ఆమె తన తల్లిదండ్రులకు అలాగే సెంచూరియన్ డిఫెన్స్ అకాడమీకి విజయానికి క్రెడిట్ ఇస్తుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో ఫైటర్ పైలట్‌లో మహిళలకు కేవలం రెండు సీట్లు మాత్రమే రిజర్వ్ చేయబడినట్లు ఆమె చెప్పారు. "నేను మొదటి ప్రయత్నంలో సీటు సాధించలేకపోయాను, కానీ నా రెండవ ప్రయత్నంలో నాకు చోటు దొరికింది." అని చెప్పారు.

సానియా తల్లి తబస్సుమ్ మీర్జా మాట్లాడుతూ.. ''మా కుమార్తె మమ్మల్ని, మొత్తం గ్రామాన్ని గర్వించేలా చేసింది. ఆమె మొదటి ఫైటర్ పైలట్ కావాలనే కలను నెరవేర్చుకుంది. ఆమె గ్రామంలోని ప్రతి అమ్మాయిని వారి కలలను అనుసరించేలా ప్రేరేపించింది.'' అని అన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో, పురుషులు, మహిళలు కలిపి మొత్తం 400 సీట్లు ఉన్నాయి. ఇందులో మహిళలకు 19 సీట్లు ఉండగా, ఫైటర్ పైలట్‌లకు రెండు సీట్లు రిజర్వు చేయబడ్డాయి. ఈ రెండు సీట్లలో సానియా తన ప్రతిభతో స్థానం సంపాదించుకోగలిగింది.

Next Story