యూపీలో కొన‌సాగుతున్న నాలుగో ద‌శ పోలింగ్‌.. ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌ముఖులు

Uttar Pradesh polls 4th phase polling begins across 59 seats.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా బుధ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 11:27 AM IST
యూపీలో కొన‌సాగుతున్న నాలుగో ద‌శ పోలింగ్‌.. ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌ముఖులు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా బుధ‌వారం నాలుగో విడుత‌ పోలింగ్ కొన‌సాగుతోంది. ఫిలిబిత్, లఖీంపుర్ ఖేరీ, సీతాపుర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బాందా, ఫతేపుర్ జిల్లాల‌ పరిధిలోని మొత్తం 59 స్థానాలకు పోలింగ్ జ‌రుగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. మొత్తం 624 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉండ‌గా.. 2.3 కోట్ల మంది ఓట‌ర్లు ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

ఓటు వేసేందుకు ఉద‌యం నుంచే ఓట‌ర్లు భారీగా పోలింగ్ కేంద్రాల‌కు చేరుకున్నారు. పోలింగ్ ప్రారంభ‌మైన తొలి రెండు గంట‌ల్లోనే(9 గంట‌ల వ‌ర‌కు) 9.10 శాతం పోలింగ్ న‌మోదు అయిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. ఉన్నావ్‌లోని సోహ్రామౌ ప్రాంతంలో ఈవీఎంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఓటింగ్ ఆల‌స్యంగా మొద‌లైంది. ఇక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

ప‌లువురు ప్ర‌ముఖులు నేడు ఓటు వేశారు. కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆయ‌న కుమారుడు పంక‌జ్ లు ల‌ఖ్‌న‌వూలో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 300 స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌ని అన్నారు. లక్నోలోని మున్సిపల్ నర్సరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఓటు వేశారు.

Next Story