జనవరి 5 వరకు 144సెక్షన్ అమలు.. ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో కఠిన ఆంక్షలు..!
Uttar Pradesh Invokes Section 144 CrPC In This City Till January 5. కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో లక్నో జిల్లాలో డిసెంబర్ 7 నుండి జనవరి 5, 2022 వరకు సెక్షన్ 144
By అంజి Published on 8 Dec 2021 11:30 AM ISTకొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో లక్నో జిల్లాలో డిసెంబర్ 7 నుండి జనవరి 5, 2022 వరకు సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోబడింది. రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, జిమ్‌లు, స్టేడియంలను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవనున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఏదైనా కార్యక్రమాలలో 100 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని ఉత్తర్వులో చెప్పారు.
"సరైన పోలీసు అనుమతి లేకుండా ఎవరూ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో ఊరేగింపు చేయరాదని" జాయింట్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) పియూష్ మోర్డియా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. "లక్నో కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించే పని ఎవరూ చేయకూడదని" అని తెలిపారు. లక్నో జిల్లాలో జరగనున్న పరీక్షల దృష్ట్యా, యూపీసీఎస్, పీఎస్సీ లేదా ప్రభుత్వ సంబంధిత పరీక్షలకు సంబంధించిన ఏదైనా పరీక్షా కేంద్రాల వద్ద సామాజిక వ్యతిరేక శక్తులు, చీటింగ్‌లకు పాల్పడే వ్యక్తులను అరికట్టేందుకు పోలీసు బలగాలను మోహరిస్తామని పోలీసులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అన్ని జిల్లాలకు కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.
రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులందరికీ RT-PCR పరీక్షలను నిర్వహించడమే కాకుండా, వ్యాధి సోకిన రోగులందరికీ జన్యు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలను మరింత మెరుగుపరచడంపై కూడా రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు వైద్య సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సిహెచ్‌సిలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పిహెచ్‌సిలు) 19,000 పడకలు, మెడికల్ కాలేజీలలో 55,000 పడకలు పెంచుతున్నారు. కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో ఆసుపత్రుల్లో సరైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులను ఆదేశించారు. దీనితో పాటు, ఆక్సిజన్, పడకలు, ల్యాబొరేటరీల లభ్యతపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.