ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు విచక్షణా రహితంగా దాడిచేశారు. పైపులు, కర్రలు, లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంబేద్కర్‌నగర్ జిల్లా జలాల్‌పూర్‌లోని ఓ ప్రాంతంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఆ స్థలం తమది అంటూ కొందరు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఓ వైపు స్థలం పై వివాదం కొనసాగుతుండగా.. మరో వైపు విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా ఆదివారం పలువురు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనకారులపై లాఠీలు, పైపులు, కట్టెలతో విచక్షణా రహితంగా దాడి చేశారు పోలీసులు.
మహిళలు తమపై రాళ్లతో దాడిచేశారని, మహిళా అధికారిని జుట్టుపట్టుకుని కొట్టారని పోలీసులు తెలిపారు. "గందరగోళం సమయంలో, కొంతమంది నిరసనకారులు పోలీసు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు" అని అంబేద్కర్ నగర్ పోలీసు అధికారి అజిత్ కుమార్ సిన్హా చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీలకు పని చెప్పాల్సి వచ్చిందన్నారు.