బీహార్ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో విభేదిస్తున్న ఉపేంద్ర కుష్వాహా సోమవారం బీహార్‌లోని జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిన్హా లైబ్రరీలో తన మద్దతుదారులతో రెండు రోజులుగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర శాసనమండలికి కూడా రాజీనామా చేస్తానని కుష్వాహా తెలిపారు.
“నా రాజీనామా లేఖను అందజేయడానికి నాకు సమయం ఇవ్వాలని నేను బీహార్ విధాన పరిషత్ చైర్మన్‌ను అభ్యర్థించాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించినంతవరకు.. నేను తప్పుకుంటున్నాను అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ కు తెలియజేశానని కుష్వాహా తెలిపారు. కుష్వాహా రాష్ట్రీయ లోక్ జనతాదళ్ అనే కొత్త రాజకీయ పార్టీని కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు.
"నేను నా పార్టీ RLSP (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ)ని JD-Uలో విలీనం చేసినప్పుడు.. పార్టీలో ప్రారంభ కాలం బాగానే ఉంది. నితీష్ కుమార్ తన రాజకీయ వారసత్వాన్ని (RJD నాయకుడు) తేజస్వి యాదవ్‌కు 2025లో అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది జెడి-యుని తీవ్రంగా దెబ్బతీస్తుందని.. తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ నాశనమవుతుందని సూచించాను. జెడి-యు పడవ మునిగిపోవడం నాకు ఇష్టం లేదు. నా సూచనను ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు.