తన ప్రైవేట్ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడంతో సహరాన్‌పూర్‌లో 20 ఏళ్ల యువతి విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా నలుగురిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. నివేదిక ప్రకారం బాధిత మహిళ ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల నుండి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) అతుల్ శర్మ మాట్లాడుతూ, "బెహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో నివసిస్తున్న ఒక యువతి విషం సేవించి మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు." అని తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె శుక్రవారం మృతి చెందిందని, అదే రోజు ఆమెకు అంత్యక్రియలు చేశారని తెలిపారు.ఆమె పుస్తకాలలో సూసైడ్ నోట్ దొరికింది.
"సూసైడ్ నోట్‌లో.. వసీం, సలీమ్ అనే ఇద్దరు వ్యక్తులు తన అభ్యంతరకరమైన చిత్రాలను తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారని ఆ మహిళ ఆరోపించింది. తన మరణానికి వారే కారణమని ఆమె ఆరోపించింది. దీని ఆధారంగా మేము నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాము, విచారణ ప్రారంభించాము" అని శర్మ చెప్పారు. వసీం, సలీమ్‌లతో పాటు మరో ఇద్దరు మోహిత్, ధీరజ్‌లను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.