జనవరి 1వ తేదీ వరకు పాఠశాలలు బంద్..!
ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు విధ్వంసం కొనసాగుతోంది.
By - Medi Samrat |
ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు విధ్వంసం కొనసాగుతోంది. పర్వతాలపై మంచు కురుస్తుండడం, దట్టమైన పొగమంచుతో పాటు అక్కడి నుంచి వస్తున్న శీతల పశ్చిమ గాలులు యూపీలో ప్రజల ఇబ్బందులను పెంచాయి. ఈ నేపథ్యంలో 12వ తేదీ వరకు ఉన్న ICSE, CBSE, UP బోర్డ్‌లోని అన్ని పాఠశాలలు జనవరి 1 వరకూ మూసివేయబడ్డాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రానున్న మూడు రోజుల పాటు ఈ పొగమంచు నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదు. అదే సమయంలో ఆదివారం సహరాన్‌పూర్, బిజ్నోర్, ముజఫర్‌నగర్‌లలో సీజన్‌లో అత్యంత చలిగా ఉంది. మీరట్‌లో చలి 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మీరట్ నైనిటాల్ కంటే చల్లగా ఉంది.
దట్టమైన పొగమంచు కారణంగా ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, సహరాన్‌పూర్‌లలో దృశ్యమానత సున్నాగా మారింది. ఫతేపూర్‌లో 10 మీటర్లు, మీరట్‌లో 15 మీటర్లు, హమీర్‌పూర్‌లో 20 మీటర్ల విజిబిలిటీ నమోదైంది. మీరట్, ఇటావాలో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీలుగా నమోదైంది. మీరట్‌లో గత 13 ఏళ్ల రికార్డును తిరగరాసిన అలాంటి చలి ఆదివారం నమోదైంది.
సూర్యుడు రోజంతా మేఘాలు, పొగమంచు వెనుక దాగి ఉన్నాడు. నగరం నుండి గ్రామీణ ప్రాంతాల వరకు దట్టమైన పొగమంచు విస్తరించింది. కొండలలో ఉండే నైనిటాల్ కంటే మీరట్ చల్లగా ఉండేలా పరిస్థితి మారింది.
మీరట్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 16.6 డిగ్రీలు కాగా.. నైనిటాల్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 16.8 డిగ్రీలుగా నమోదైంది. నైనిటాల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్, మీరట్‌లో 6.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. రాత్రి వేళల్లో విజిబిలిటీ తక్కువగా ఉండడంతో రోడ్లు, హైవేలపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలా చోట్ల విజిబిలిటీ సున్నాకి చేరుకుంది. దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. డ్రైవర్లు పగటిపూట కూడా హెడ్‌లైట్లు వేసి నిదానంగా నడపాల్సి వస్తుంది.