భార్య స్నానం చేయడంలేదని విడాకులు కోరిన భర్త..!
UP Man Seeks Divorce After Wife Fails To Take Bathe Daily.ఇటీవల కాలంలో విడాకుల కేసులు ఎక్కువగా చూస్తున్నాం.
By తోట వంశీ కుమార్ Published on 24 Sept 2021 4:07 PM ISTఇటీవల కాలంలో విడాకుల కేసులు ఎక్కువగా చూస్తున్నాం. చిన్న చిన్న కారణాలతో పండంటి కాపురాన్ని మధ్యలోనే కూల్చేసుకుంటున్నారు. ఎవరో ఒకరు సర్దుకుపోతే సమిసిపోయే సమస్యను చాలా కాంప్లికేటెడ్‌గా తయారు చేసుకుంటున్నారు. తాజాగా ఓ భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే.. ఇందుకు అతడు చెప్పిన కారణం ఏమిటో తెలిస్తే నవ్వాలో లేక ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు భార్య స్నానం చేయడం లేదని.. విడాకులు ఇప్పటించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చందౌస్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం వ్యక్తికి క్వార్సీ గ్రామానికి చెందిన ఓ మహిళతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఏడాది వయసు ఉన్న ఓ పాప ఉంది. అతడి భార్య రోజు స్నానం చేసేది కాదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. విసుగుచెందిన భర్త.. ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. దీంతో అతడి భార్య ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ను ఆశ్రయించింది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని.. వివాహ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పింది.
అధికారులు ఆ దంపతులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే.. భర్త మాత్రం తనకు విడాకులు కావాలని పట్టుబట్టాడు. అంతేకాకుండా విడాకులు మంజూరు చేయాలంటూ ఓ దరఖాస్తు వారికి అందజేశాడు. కాగా.. చిన్న చిన్న సమస్యలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని సూచించినట్లు కౌన్సిలర్ తెలిపారు. వారికి ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్లు చెప్పారు.