ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా కొనసాగుతుంది. 45 రోజుల పాటు సాగే ఈ మహా కుంభ మేళాకు భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగంమంలో పుణ్య స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివెళ్తున్నారు. లేటెస్ట్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా మహా కుంభ మేళాకు హాజరయ్యారు.
సీఎం యోగి ఆదిత్య నాథ్‌తో పాటు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంలు కేవశ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ సహా కేబినెట్ మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా సీఎం యోగి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి హారతి ఇచ్చారు. మకర సంక్రాంతి రోజు ప్రారంభమైన మహా కుంభమేళా వచ్చే నెల 26వ తేదీ మహా శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగిన రీతిలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.