ఢిల్లీలోని కొండ్లీలో నవజాత శిశువును ప్రసవించిన తర్వాత బాత్ రూమ్ కిటికీ నుండి విసిరేసినందుకు పెళ్లికాని ఓ అమ్మాయిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల యువతి మగబిడ్డను ప్రసవించిన కొద్దిసేపటికే తన వాష్‌రూమ్‌లోని కిటికీలోంచి విసిరేసింది. తూర్పు ఢిల్లీలోని కొండ్లీలోని జై అంబే అపార్ట్‌మెంట్‌లో ఆమె నివాసం ఉంటోంది. అపార్ట్మెంట్ వాసులు శిశువును కనుగొని ఆమె దగ్గరకు వెళ్లారు. వారు యువతి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి తనిఖీ చేయగా రక్తపు జాడలు కనిపించాయి. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి అవివాహిత అని నిర్ధారించారు పోలీసులు. సమాజంలో ఎలా తిరగాలి అనే భయంతో ఆమె శిశువును వదిలించుకోవడానికి ప్రయత్నించింది.
మరో వైపు.. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఏడు నెలల గర్భిణిని ఆమె భర్త, అత్తమామలు నిప్పంటించారు. ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె భర్తకు కూడా కాలిన గాయాలయ్యాయి. ఈ సంఘటనలో కాలిన గాయాలకు కారణం తమ అత్తారింటి వాళ్లు కాదని మహిళ పోలీసులకు చెప్పింది. అయితే ఆమె సోదరుడు మాత్రం మహిళ భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, ఆమెపై హత్యాయత్నం చేశారని ఆరోపించాడు.