గంటన్నర పాటు విరిగిన సీట్లోనే కూర్చున్నా..ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి అసంతృప్తి
ఢిల్లీ విమానంలో విరిగిన సీటు తనకు కేటాయించారని కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు.
By Knakam Karthik
గంటన్నర పాటు విరిగిన సీట్లోనే కూర్చున్నా..ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి అసంతృప్తి
ఢిల్లీ విమానంలో విరిగిన సీటు తనకు కేటాయించారని కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత ఎయిర్ లైన్స్ సేవలు మెరుగుపడతాయని అనుకున్నానని.. కానీ అది తన అపోహేనని అర్థమయ్యిందని కేంద్ర మంత్రి అసహనం వ్యక్తంచేశారు.
ఫ్లైట్ ఎక్కిన వెంటనే నేను బుక్ చేసుకున్న సీటు విరిగి ఉండటంతో ఆశ్చర్యపోయాను.. దీనిపై ఎయిర్‌లైన్స్ స్టాఫ్‌ను ప్రశ్నిస్తే.. ఈ సమస్యను మేనేజ్‌మెంట్ ఆలస్యంగా గుర్తించిందని.. ఈ సీటు టికెట్‌ను ప్రయాణికులకు విక్రయించకూడదని ఆదేశించిందని తెలిపారు. విమానంలో అదొక్కటే కాకుండా మరిన్ని సీట్లు కూడా సరిగా లేవని సిబ్బంది చెప్పారు" అని కేంద్రమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోమని ఆఫర్ చేశారని అన్నారు. కానీ వారికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తాను అదే విరిగిపోయిన సీట్లోనే గంటన్నర పాటు కూర్చొని ప్రయాణించానని తెలిపారు.
ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేసి, అసౌకర్యమైన సీట్లు కేటాయించడం ప్రయాణికులను మోసం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. భవిష్యత్తులో అయినా ఎయిర్ ఇండియా యాజమాన్యం తమ ప్రయాణికులను ఇటువంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటుందా లేదంటే వారి అవసరాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటుందా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ ట్వీట్‌పై ఎయిర్ లైన్స్ స్పందిస్తూ.. ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
आज मुझे भोपाल से दिल्ली आना था, पूसा में किसान मेले का उद्घाटन, कुरुक्षेत्र में प्राकृतिक खेती मिशन की बैठक और चंडीगढ़ में किसान संगठन के माननीय प्रतिनिधियों से चर्चा करनी है।मैंने एयर इंडिया की फ्लाइट क्रमांक AI436 में टिकिट करवाया था, मुझे सीट क्रमांक 8C आवंटित हुई। मैं जाकर…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 22, 2025