న్యూఢిల్లీ: కోవిడ్ ఓమిక్రాన్ వేరియంట్‌పై పోరాడడానికి నిర్దిష్ట mRNA ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ప్రారంభించారు. GEMCOVAC-OM అనే ఈ వ్యాక్సిన్ కు సిరంజి అవసరం ఉండదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) సహకారంతో జెనోవా స్వదేశీ ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి mRNA వ్యాక్సిన్. మిషన్ కొవిడ్ సురక్ష కింద జెనోవా బయోఫార్మాక్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. రోగులు ఎవరైనా కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలు వేయించుకున్నా బూస్టర్ డోస్‌గా ఈ ఒమిక్రాన్ వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చు. కొన్ని రోజుల క్రితమే ఈ టీకా అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి ఆమోదం పొందింది. GEMCOVAC-OM వ్యాక్సిన్ మిషన్ కోవిడ్ సురక్ష మద్దతుతో అభివృద్ధి చేసిన ఐదవ వ్యాక్సిన్.
భవిష్యత్తులో ఏవైనా అత్యవసరం అయినప్పుడు.. తక్కువ సమయంలో ఇతర వ్యాక్సిన్‌లను తయారు చేయడానికి ఉపయోగించవచ్చని జితేంద్ర సింగ్ చెప్పారు. GEMCOVAC-OM అనేది థర్మోస్టేబుల్ టీకా, ఈ టీకాకు సంబంధించి ఇతర mRNA-ఆధారిత వ్యాక్సిన్‌ల కోసం ఉపయోగించే అల్ట్రా-కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి సూది అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ ఇంట్రా-డెర్మల్‌గా పంపిణీ చేస్తారు.
క్లినికల్ ఫలితాలు చాలా బాగా వచ్చాయని జెనోవా బయోఫార్మాక్యూటికల్స్ సంస్థ సిఇఒ సంజయ్ సింగ్ చెప్పారు. ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత ఇతర వ్యాక్సిన్ల మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అతిశీతల సరఫరా వ్యవస్థ అవసరం లేదన్నారు. దేశంలో ఎక్కడికైనా ఎటువంటి ఉష్ణోగ్రతల్లో నైనా సరఫరా చేయవచ్చన్నారు. ఎంఆర్‌ఎన్‌ఎ ఆధారిత డిసీజ్ యాగ్నోస్టిక్ ప్లాట్‌ఫారం టెక్నాలజీ ఉపయోగించి ఈ జెమ్ కొవాక్ ఒఎం వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఇదే టెక్నాలజీతో మరికొన్ని వ్యాక్సిన్లను తీసుకుని రానున్నారు.