బుధవారం బీహార్‌లోని గయలో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలిని ఆమె భర్త కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు సుష్మా దేవి, ఆమె పిల్లలు, సోదరి పూనమ్ కుమారి.. టెటువా గ్రామంలోని ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గయ లోక్‌సభ ఎంపీ, కేంద్ర మంత్రి మాంఝీ ఈ ఘటన గురించి ఇంకా స్పందించలేదు. మాంఝీ బీహార్‌లోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మిత్రపక్షం అయిన హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) వ్యవస్థాపకుడు కూడా.
మృతురాలు సుష్మాదేవిపై భర్త రమేశ్ కోపం పెంచుకున్నాడు. బుధవారం ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. ఆ తర్వాత ఆమె ఛాతిపై కాల్చి పారిపోయాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మగధ్ ఆసుపత్రికి తరలించారు. సుష్మను ఆమె భర్తే కాల్చి చంపాడని, ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ టీమ్, టెక్నికల్ సెల్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితుడిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని గయా ఎస్‌ఎస్‌పీ ఆనంద్ కుమార్ చెప్పారు. నిందితుడు రమేశ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.