ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, నవంబర్ 10 సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద కార్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై మంత్రివర్గం రెండు నిమిషాల మౌనప్రార్థన నిర్వహించింది. తరువాత మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
'దేశం ఒక దారుణమైన ఉగ్రదాడికి సాక్ష్యమైంది. నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ పేలుడుతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. మంత్రివర్గం ఈ నిర్దాక్షిణ్యమైన హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తూ బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. వైద్య సిబ్బంది, అత్యవసర సిబ్బంది చూపిన చురుకుదనం, సేవా స్పూర్తిని మంత్రివర్గం అభినందించింది. ఉగ్రవాదంపై భారతదేశం ‘జీరో టోలరెన్స్’ విధానానికి కట్టుబడి ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించింది. వివిధ దేశాల నుండి వచ్చిన సంఘీభావ ప్రకటనలను మంత్రివర్గం అభినందించింది. దాడి దర్యాప్తును అత్యవసరంగా, అత్యున్నత స్థాయిలో కొనసాగించాలని, నిందితులను, సహచరులను, మరియు పరోక్ష మద్దతుదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలనే ఆదేశాలను మంత్రివర్గం జారీ చేసింది. దేశ పౌరుల భద్రత, జాతీయ భద్రత పట్ల ప్రభుత్వ అంకితభావాన్ని మంత్రివర్గం మరోసారి పునరుద్ఘాటించింది.