నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం బుధవారం నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

By Knakam Karthik
Published on : 28 Aug 2025 10:10 AM IST

National News, Union Cabinet, railway projects, Pm Modi

నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం బుధవారం నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.12,328 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులు ప్రయాణికులు, సరుకు రవాణా రెండింటికీ మేలు చేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఆమోదం పొందిన ప్రాజెక్టులు:

1. దేశల్పార్‌ – హాజీపీర్‌ – లూనా & వయోర్‌ – లాఖ్‌పట్‌ కొత్త లైన్‌ (గుజరాత్‌ – 145 రూట్‌ కి.మీ)

2. సికింద్రాబాద్‌ (సనత్‌నగర్‌) – వాడి 3వ, 4వ లైన్‌ (కర్ణాటక-తెలంగాణ – 173 కి.మీ)

3. భాగల్పూర్‌ – జమాల్‌పూర్‌ 3వ లైన్‌ (బిహార్‌ – 53 కి.మీ)

4. ఫుర్కాటింగ్‌ – న్యూ టిన్సుకియా డబ్లింగ్‌ (అసోం – 194 కి.మీ)

ప్రధాన ప్రయోజనాలు:

• కొత్త రైల్వే లైన్‌ ద్వారా గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో 13 కొత్త స్టేషన్లు ఏర్పడి, 866 గ్రామాలు, సుమారు 16 లక్షల జనాభాకు కనెక్టివిటీ లభించనుంది.

• కచ్‌లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌, ధోలవిరా హరప్పా స్థలం, కోటేశ్వర్ ఆలయం, నారాయణ సరోవర్‌, లాఖ్‌పట్‌ కోటలు పర్యాటకానికి చేరువ కానున్నాయి.

• కర్ణాటక, తెలంగాణ, బిహార్‌, అసోం రాష్ట్రాల్లో మల్టీ-ట్రాకింగ్ ద్వారా 3,108 గ్రామాలు, 47.34 లక్షల జనాభాకు సౌకర్యాలు పెరుగుతాయి.

• నిర్మాణ పనుల్లో 251 లక్షల మానవ దినాల ఉపాధి కలుగుతుంది.

• బొగ్గు, సిమెంట్‌, ఫ్లై-ఆష్‌, స్టీల్‌, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం వంటి సరుకు రవాణా సులభతరం అవుతుంది.

• 68 మిలియన్‌ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది.

• 56 కోట్ల లీటర్ల ఇంధన దిగుమతులు తగ్గుతాయి, 360 కోట్ల కిలోల CO2 ఉద్గారాలు తగ్గుతాయి – ఇది 14 కోట్ల చెట్లు నాటిన సమానమని ప్రభుత్వం తెలిపింది.

ఈ ప్రాజెక్టులు పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ లో భాగంగా అమలు అవుతున్నాయి. పర్యావరణ హితంగా, లాజిస్టిక్ ఖర్చులు తగ్గించేలా, ఆత్మనిర్భర్ భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇవి ముందడుగు కాబోతున్నాయి.

Next Story