ఇది భారతదేశ కలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోదీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
By Medi Samrat Published on 1 Feb 2025 3:48 PM ISTఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించగా.. ఇంకా అనేక పెద్ద ప్రకటనలు చేశారు. బడ్జెట్ సమర్పణ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్‌లో పర్యాటక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, భారతదేశ కలను సాకారం చేసే బడ్జెట్ ఇదని అన్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు ఒక ముఖ్యమైన మైలురాయి అని ప్రధాని మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్ ఇది, ప్రతి భారతీయుడి కలలను సాకారం చేసే బడ్జెట్ ఇది. యువత కోసం అనేక రంగాలను తెరిచాం.. ఇది వికసిత్ భారత్ మిషన్‌ను నడిపించబోతోందన్నారు.
కొత్త పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం గ్యారెంటీ లేకుండా రూ.2 కోట్ల వరకు రుణ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో గిగ్ కార్మికుల కోసం పెద్ద ప్రకటన చేశారు. మొట్టమొదటిసారిగా గిగ్ వర్కర్లు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయబడి.. ఆరోగ్య సేవల ప్రయోజనం పొందనున్నారు.
సాధారణంగా బడ్జెట్‌లో ప్రభుత్వ ఖజానా ఎలా నిండుతుంది అనే దానిపైనే దృష్టి సారిస్తారని, అయితే ఈ బడ్జెట్ దానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఈ బడ్జెట్ దేశ పౌరుల జేబులను ఎలా నింపాలి.. దేశ పౌరుల పొదుపు మొత్తాలు ఎలా పెరగాలి.. దేశ పౌరులు అభివృద్ధిలో ఎలా భాగస్వాములు అవుతారు.. అనేదానికి ఈ బడ్జెట్ చాలా బలమైన పునాది వేస్తుందన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు. 'ప్రతి రంగంలో అభివృద్ధి చెందిన.. ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మోదీ ప్రభుత్వ విజన్ బ్లూప్రింట్ బడ్జెట్-2025. రైతులు, పేదలు, మధ్యతరగతి, మహిళలు, పిల్లల విద్య, పోషకాహారం, ఆరోగ్యం మొదలుకొని స్టార్టప్, ఆవిష్కరణలు, పెట్టుబడి వరకు ప్రతి రంగాన్ని కవర్ చేసే ఈ బడ్జెట్ మోడీ జీ స్వావలంబన భారతదేశానికి రోడ్‌మ్యాప్ అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. 'బలమైన, సుసంపన్నమైన, స్వావలంబనతో కూడిన భారతదేశానికి ఈ బడ్జెట్ దిశానిర్దేశం చేస్తుంది. ఇందులో మహిళలు, కూలీలు, పేదలు, రైతులు, యువత, వ్యాపారులు, వ్యవసాయం, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనంతో పాటు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందుతాయన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులు సహా అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.