ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన మద్దతును ప్రకటించారు. గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం సంతోషంగా ఉందన్నారు. ముర్ముకు మద్దతుగా ఉద్ధవ్ థాకరే తీసుకున్న ఈ నిర్ణయం.. యశ్వంత్ సిన్హాను పోటీకి దింపిన ప్రతిపక్ష ఫ్రంట్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. "శివసేన ఎంపీలు నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, కానీ వారు అభ్యర్థించారు. వారి సూచనను వింటూ.. మేము రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వబోతున్నాం" అని ఉద్ధవ్ థాకరే చెప్పారు.
మహారాష్ట్రలోని శివసేనకు చెందిన 18 మంది లోక్‌సభ ఎంపీలలో 13 మంది మంగళవారం నాడు జరిగిన కీలక సమావేశానికి హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది రాష్ట్రపతి ఎన్నికలలో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని సూచించారు. అయితే, ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్.. యశ్వంత్ సిన్హాకు గట్టిగా మద్దతు తెలిపారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్యంగా ఆదివాసీ వర్గానికి చెందిన వారు.. గిరిజన మూలాల కారణంగా ముర్ముకు మద్దతు ఇవ్వాలని శివసేన నాయకత్వాన్ని కోరారు.
ఇదిలావుంటే.. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది, ఈ ఎన్నికలలో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసుడిని ఎన్నుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన 4,809 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. దేశ రాజధానిలో జూలై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.