గురువారం రెండేళ్ల బాలిక ఇంటి బయటకు ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు 200 అడుగుల బోరుబావిలో పడిపోయింది. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల.. వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన రాజస్థాన్ దౌసాలో జరిగింది. బాలికను బోరుబావి నుంచి బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 60 నుంచి 70 అడుగుల లోతులో బాలిక చిక్కుకుపోవడంతో ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అభనేరి సమీపంలోని జస్సా పడ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాలిక అంకిత ఇంటి బయట ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. బోరుబావి చుట్టు పక్కల జేసీబీ సాయంతో తవ్వి సీసీ కెమెరాల ద్వారా బాలిక కదలికలను పరిశీలిస్తున్నారు. ఆమెకు పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బాలికను సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా జనం గుమిగూడారు.