నిన్న మోస్ట్ వాంటెడ్ సలీం పర్రే హతం.. నేడు మరో ఎన్ కౌంటర్..!

Two terrorists killed in encounter in Jammu and Kashmir. జమ్మూ కశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఉదయం కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు

By M.S.R  Published on  4 Jan 2022 10:00 PM IST
నిన్న మోస్ట్ వాంటెడ్ సలీం పర్రే హతం.. నేడు మరో ఎన్ కౌంటర్..!

జమ్మూ కశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఉదయం కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు చనిపోయాడు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో కుల్గాంలోని ఒకాయ్ గ్రామంలో సైనికులు, కశ్మీర్ పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. ఉగ్రవాదులను భద్రతా దళాలు సమీపించగానే కాల్పులు జరిపారు. దీంతో అలర్ట్ అయిన సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. రెండు వైపుల నుంచి హోరాహోరీ కాల్పుల అనంతరం ఒక టెర్రరిస్టు మరణించాడు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

శ్రీనగర్‌ శివారులో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్‌ జోన్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. " లష్కరే కమాండర్ సలీమ్ పర్రేను చంపడం పోలీసులకు పెద్ద విజయం. 2016లో 12 మంది పౌరులను చంపడంలో సలీమ్ పర్రే ప్రమేయం ఉందని" విజయ్ కుమార్ తెలిపారు. గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్‌ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్‌ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. చెప్పినా వినకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయి.

Next Story