ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వెలుగులోకి వచ్చింది. రాధా సింగ్ (24), ఆమె చెల్లెలు జియా సింగ్ (22) ఫినైల్ తాగారు. అనారోగ్యంతో ఉన్న జర్మన్ షెపర్డ్ అనే పెంపుడు కుక్కను కోల్పోతారనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టోనీ అని పేరు పెట్టి ఎంతో బాగా చూసుకుంటున్న కుక్క అనారోగ్యం పాలవ్వడం వారిని కలచివేసింది.
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గ్రాడ్యుయేట్లు. వారి కుక్కతో ఎంతో అనుబంధం కలిగి ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. టోనీ దాదాపు ఒక నెల నుండి అనారోగ్యంతో ఉంది. ఇది సోదరీమణుల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కుక్క తినడం మానేయడంతో వీరిద్దరూ కూడా భోజనం మానేశారు. కుక్క ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వీరిద్దరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇక ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది. పత్తి ప్రాసెసింగ్‌లో పనిచేసే వారి తండ్రి కైలాష్ సింగ్ గత ఆరు నెలలుగా తీవ్రమైన అనారోగ్యం కారణంగా మంచం పట్టారు. ఏడు సంవత్సరాల క్రితం మెదడు రక్తస్రావం కారణంగా ఆ కుటుంబం చిన్న కొడుకును కోల్పోయింది. అన్నయ్య వీర్ సింగ్ ఆస్తి వ్యాపారంలో పనిచేస్తున్నాడు. కుటుంబం ఇప్పటికే అనేక సంక్షోభాలతో సతమతమైందని, పెంపుడు కుక్క పరిస్థితి దిగజారడం వల్ల అక్కాచెల్లెళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.