ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎమ్) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని మీరట్‌లోని కితౌద్ ప్రాంతం నుండి ఢిల్లీకి బయలుదేరినప్పుడు ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిపినందుకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. "ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఏఐఎంఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణ జరుగుతోంది' అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హపూర్, దీపక్ భుకర్ తెలిపారు.
ఒవైసీ "హిందూ వ్యతిరేక" ప్రకటనలతో నిందితులు బాధపడ్డారని భుకర్ తెలియజేశారు. ఓవైసీ శుక్రవారం పార్లమెంటులో తన కాన్వాయ్‌పై భద్రతా ఉల్లంఘన మరియు దాడి అంశాన్ని లేవనెత్తుతారని వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై చర్చించేందుకు ఒవైసీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఎన్నికల ప్రచారం కోసం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.