నా ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారు.. మమతా గుస్సా..!
Trinamool Writes To Election Panel After BJP Leaks Mamata Banerjee Audio. దేశం మొత్తం కరోనా దెబ్బకు విలవిలలాడుతూ ఉంటే..
By Medi Samrat
దేశం మొత్తం కరోనా దెబ్బకు విలవిలలాడుతూ ఉంటే.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఎన్నికల వేడి కనిపిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ బయటకు వస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తమ ఫోన్స్ ను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మమతా బెనర్జీ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని.. దీనిపై తాను సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్టు మమతా బెనర్జీ తెలిపారు.
కూచ్‌బేహార్ కాల్పుల్లో చనిపోయిన వారి మృతదేహాలతో ర్యాలీ నిర్వహించాలంటూ.. సీఎం మమత చెబుతున్నట్టు ఓ ఆడియో బయటికి రావడం కలకలం రేపడంతో దీదీ బీజేపీపై విరుచుకుపడింది. అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోలేక బీజేపీ ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని.. వాళ్లు బీజేపీ నేతలు ప్రతిరోజూ మేము మాట్లాడుకునే సంభాషణలను కూడా చోరీ చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కయ్యి కేంద్ర బలగాలే ఇలాంటి పనులు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉందని అన్నారు మమతా బెనర్జీ. ఇందులో తమ పాత్ర లేదంటూ బీజేపీ వాళ్లు చెప్పుకొచ్చినా.. కచ్చితంగా దీని వెనుక బీజేపీ ఉన్నట్టు స్పష్టమవుతోందని మమత అంటున్నారు.
మరో వైపు బెంగాల్ ప్రచారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి పేరుతో పదేళ్లుగా మమతా బెంగాలీలను మోసం చేశారని, అభివృద్ధికి అడ్డుగా ఓ గోడ లాగా నిలిచారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా హెల్త్ చెకప్ స్కీంను ప్రతిపాదిస్తే అది అమలు కాకుండా అడ్డుగా ఉన్నారని, శరణార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందిస్తే వాటిని కూడా మమత ఒప్పుకోలేదని మోదీ అన్నారు. సీఎం మమతకు అహంకారం బాగా పెరిగిపోయిందని, ఎదుటి వారు ఎంతవారైనా వారందరూ ఆమెకు చిన్నగా కనిపిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అనేక విషయాలపై చర్చించడానికి మమతను ఆహ్వానించిందని, కానీ ప్రతిసారీ ఏదో ఒక కారణం చెబుతూ ఆ భేటీలకు ఆమె హాజరవ్వలేదని మోదీ అన్నారు. కరోనా విషయంలో కేవలం రెండే రెండు భేటీలకు మమత హాజరయ్యారని, మిగతా ముఖ్యమంత్రులందరూ భేటీలకు హాజరయ్యారని తెలిపారు.