తక్షణమే తగ్గనున్న రైలు చార్జీలు.. రైల్వే బోర్డు ప్రకటన.!

Train fares will be reduced immediately .. Railway Board announcement. రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లో కొవిడ్‌కు ముందున్న చార్జీలను వసూలు చేయనుంది. కొవిడ్‌ నిబంధనలు,

By అంజి  Published on  13 Nov 2021 10:14 AM IST
తక్షణమే తగ్గనున్న రైలు చార్జీలు.. రైల్వే బోర్డు ప్రకటన.!

రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లో కొవిడ్‌కు ముందున్న చార్జీలను వసూలు చేయనుంది. కొవిడ్‌ నిబంధనలు, లాక్‌డౌన్‌ కారణంగా రైళ్ల సర్వీసులను భారీగా తగ్గించారు. అప్పటి నుండి స్పెషల్‌ రైళ్ల పేరుతో పరిమితంగా మాత్రమే రైల్వే బోర్డు సేవలను అందిస్తోంది. కరోనా కారణంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, అనవసరపు జర్నీలను తగ్గించేందుకు రైలు చార్జీలను పెంచారు. అయితే ప్రస్తుతం కోవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టుతుండడంతో రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ముందు తీసుకున్న రైలు చార్జీలను మళ్లీ ఇప్పుడు తీసుకుంటామంటూ రైల్వే బోర్డు ప్రకటించింది. పాత చార్జీలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. ఇది అన్ని రకాల రైలులు, క్లాసులకు వర్తిస్తుందని వెల్లడించింది.

అలాగే పలు రైళ్లకు ఉన్న స్పెషల్‌ ట్యాగ్‌ను కూడా తొలగింపు, కొవిడ్‌ ప్రత్యేక రైళ్ల నంబర్లకు ముందు పెట్టిన సున్నాను కూడా తొలగిస్తున్నారు. ఇక పాత నంబర్లతోనే రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. రెగ్యులర్‌ సర్వీసులను ఎప్పటి నుంచి జోన్ల పరిధిలో నడపాలనే విషయాన్ని తెలుపలేదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. బెడ్‌ రోల్స్‌, భోజనం విషయంలో ప్రస్తుత నిబంధనలు కొనసాగుతాయి. దివ్యాంగులు, స్పెషల్‌ క్లాస్‌ ప్రయాణికులు, సీనియర్‌ సిటిజన్లకు గతంలో మాదిరిగానే రైలు చార్జీలు రాయితీలను పునరుద్ధరించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి స్థాయి రైల్వే సర్వీసులను అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా 25 వేల పోస్ట్‌ ఆఫీసుల్లో రైల్వే టికెట్లను విక్రయిస్తున్నామని తెలిపారు.

Next Story