ఆ బంగ్లా నుంచి చంద్రచూడ్‌ను ఖాళీ చేయించండి..కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ
జస్టిస్ డివై చంద్రచూడ్‌ను అధికారిక నివాసం నుండి తొలగిస్తూ సుప్రీంకోర్టు పరిపాలన గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది
By Knakam Karthik
ఆ బంగ్లా నుంచి చంద్రచూడ్‌ను ఖాళీ చేయించండి..కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను అధికారిక నివాసం నుండి తొలగిస్తూ సుప్రీంకోర్టు పరిపాలన గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. 2024 నవంబరు 10న సీజేఐగా పదవీ విరమణ పొందిన జస్టిస్ చంద్రచూడ్, గత 8 నెలలుగా టైప్-8 అధికారిక బంగ్లాలోనే ఉంటున్నారని తెలుపుతూ జులై 1న కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రిటైర్ అయ్యాక టైప్-7 ప్రభుత్వ బంగ్లాలో ఆరు నెలల పాటు అద్దె చెల్లించకుండానే ఉండొచ్చని, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇప్పటికే గడిచిపోయిందని సుప్రీంకోర్టు పాలనా విభాగం పేర్కొంది.
ప్రస్తుతం సీజేఐగా ఉన్న వారికి టైప్-8 అధికారిక బంగ్లాను కేటాయించాల్సి ఉన్నందున, దాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కోరింది. టైప్-8 అధికారిక బంగ్లాలో నివసించేందుకు మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు ఇచ్చిన గడువు ఈ ఏడాది మే 31తోనే ముగిసిందని తెలిపింది. అధికారిక క్వార్టర్స్‌లో ఉండేందుకు మంజూరు చేసే ఆరు నెలల గ్రేస్ పీరియడ్ కూడా ఈ ఏడాది మే 10తోనే గడిచిపోయిందని సుప్రీంకోర్టు పాలనా విభాగం గుర్తుచేసింది.
జస్టిస్ చంద్రచూడ్ భారతదేశ 50వ సీజేఐగా 2022 నవంబరు నుంచి 2024 నవంబరు వరకు సేవలు అందించారు. ఆయన అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. అయితే ఆయన ఆరు నెలలే సీజేఐగా సేవలు అందించారు. ఆ వ్యవధిలో టైప్-8 అధికారిక బంగ్లాను కేటాయించమని జస్టిస్ సంజీవ్ ఖన్నా కోరలేదు. 2024 డిసెంబరు 18న నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు జస్టిస్ చంద్రచూడ్ ఒక లేఖ రాశారు. 2025 ఏప్రిల్ 30 వరకు తనను ప్రస్తుత బంగ్లాలోనే ఉండేందుకు అనుమతించాలని కోరారు. తనకు మరో ప్రభుత్వ బంగ్లాను కేటాయించారని, అయితే అక్కడ మరమ్మతు పనులు జరుగుతున్నందున వెంటనే వెళ్లలేకపోతున్నట్లు ఆ లేఖలో జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. ఈ లేఖకు నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సానుకూలంగా స్పందించారు. 2025 ఏప్రిల్ 30 వరకు ప్రస్తుత బంగ్లాలోనే ఉండేందుకు జస్టిస్ చంద్రచూడ్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖకు సూచించారు. ఈ వ్యవధిలో ప్రతినెలా రూ.5వేలు చొప్పున లైసెన్సు ఫీజును జస్టిస్ చంద్రచూడ్ నుంచి వసూలు చేశారు. ఈ వివరాలను 2025 ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు పాలనా విభాగానికి కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల శాఖ తెలిపింది.