తిరుమల విధానం.. శబరిమలలో కూడా సక్సెస్
తిరుమలలో అమలవుతోన్న క్యూ విధానాన్ని ఆదివారం ప్రయోగాత్మకంగా శబరిమలలో కూడా పరీక్షించారు.
By Medi Samrat Published on 5 Dec 2023 5:45 PM ISTతిరుమలలో అమలవుతోన్న క్యూ విధానాన్ని ఆదివారం ప్రయోగాత్మకంగా శబరిమలలో కూడా పరీక్షించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి 4 గంటల పాటు అమలు చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరకూట్టం, సరంగుత్తి మధ్య మూడు క్యూ కాంప్లెక్స్‌లు ఉపయోగించారు. ఈ కాంప్లెక్స్‌ల వద్ద యాత్రికులను నియంత్రించిన తర్వాత, సన్నిధానం నుంచి వచ్చిన పోలీసుల ఆదేశాల మేరకు వాటిని తెరిచారు. క్యూ విధానం విజయవంతమైందని, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం వర్చువల్ క్యూ సౌకర్యం ద్వారా మొత్తం 85,000 మంది భక్తులు దర్శనం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
ఆదివారం ఉదయం నిర్మాల్య దర్శనం కోసం క్యూ మరకూట్టం వరకు పొడిగించారు. స్వామి దర్శనం కోసం ఎనిమిది గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయాన్ని కూడా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు పెంచింది. దర్శన సమయాన్ని అదనంగా 2 గంటలు పెంచి, మొత్తం 16 గంటల పాటు భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 3 గంటలకే సన్నిధానాన్ని తెరిచి సుప్రభాత సేవ, నెయ్యాభిషేకం అనంతరం దర్శనాలు ప్రారంభిస్తున్నారు. కలశాభిషేకం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు నిలిపివేస్తున్నారు. తిరిగి 4 గంటలకు దర్శనాలను ప్రారంభించి.. రాత్రి 11 గంటలకు వరకూ అనుమతిస్తున్నారు. హరివరాసనం అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నారు. రాబోయే రోజుల్లో శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా క్యూ కట్టనున్నారు.